NHAI New Directions: వాహనాల క్యూ ఎల్లో లైన్ దాటిందంటే... టోల్ ఫ్రీ
NHAI New Directions: టోల్ గేట్ల వద్ద వాహనాలు వరుస వంద మీటర్లకు మించి ఉండకూడదని స్పష్టం చేసింది.
NHAI New Directions: ఇప్పటివరకు వాహనదారులపైనే ఫోకస్ పెట్టిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఇప్పుడు టోల్ గేట్ల నిర్వహణపై దృష్టి పెట్టింది. ఇప్పటికే వంద శాతం ఫాస్టాగ్ అమల్లోకి వచ్చినందున... టోల్ గేట్ల నిర్వహణ దానికి తగినట్లుగా ఉండాలని భావించి.. అందుకు మార్గదర్శకాలను నిర్దేశించింది. ఏ టోల్ గేటు దగ్గరైనా సరే..వంద మీటర్లకు మంచి క్యూ లైన్ ఉంటే... ఆ వరుసలో ముందున్న వాహనాలను టోల్ ఫీజుతో నిమిత్తం లేకుండా వదిలేయాలని ఆదేశించింది. వంద మీటర్లకు గుర్తుగా ఒక ఎల్లో లైను కూడా ఏర్పాటు చేయనున్నారు. క్యూ ఆ ఎల్లో లైను దాటిందంటే... గేటు తెరిచి వాహనాలను వదిలేయాల్సిందే.
టోల్ గేట్ల నిర్వహణలో కొన్ని చోట్ల అలసత్వాన్ని NHAI గుర్తించింది. అన్ని గేట్లను ఓపెన్ చేయకుండా.. సిబ్బందిని సర్దుబాటు చేసుకోవడం కోసం లిమిటెడ్ గా ఒకటి రెండు గేట్లు ఓపెన్ చేసినప్పుడు.. వాహనాల క్యూ పెరిగిపోతోంది. అలాగే ఇంకా కొంతమంది ఫాస్టాగ్ తీసుకోనివాళ్లు వచ్చినప్పుడు.. వారితో సిబ్బంది బేరసారాలు చేస్తున్నట్లు కూడా గమనించారు. అందుకే ఈ కొత్త నిబంధనలను అమల్లోకి పెట్టారు.
ఇక నుంచి టోల్ గేటు దగ్గర వాహనం ఆగే అవకాశం ఇవ్వకూడదని.. జస్ట్ నెంబర్ ప్లేటు స్కానింగ్ చేసేంత టైమ్ స్లో చేయగలిగితే చాలని అధికారులు చెబుతున్నారు. అప్పుడు వాహనాలు నిలిచిపోవటం, క్యూ లైన్లు గాని కనపడవని.. ఫాస్టాగ్ పర్పస్ నెరవేరుతుందని వారు భావిస్తున్నారు. ఇకపై టోల్ ప్లాజాల నిర్మాణం కూడా ఫాస్టాగ్, నూతన నిబంధనలకు అనుగుణంగా రాబోయే పదేళ్ల ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు.