Teeka Mahotsav: నేటి నుంచి దేశవ్యాప్తంగా టీకా మహోత్సవ్
Teeka Mahotsav: ఏప్రిల్ 14వరకు జరగనున్న టీకా మహోత్సవ్
Teeka Mahotsav: నేటి నుంచి దేశంలో కోవిడ్ టీకా మహోత్సవ్ జరగనుంది. నాలుగురోజుల పాటు జరిగే టీకా మహోత్సవ్‌లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 45 ఏళ్లు పై బడిన వారికి వ్యా్క్సినేషన్ నిర్వహిస్తుండగా.. ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ వ్యాక్సినేషన్ చేయనున్నారు. ప్రధాని మోడీ పిలుపుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు చేశాయి.
మరోవైపు వ్యాక్సినేషన్‌లో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అగ్రరాజ్యం అమెరికాను అధిగమించింది. కేవలం 85 రోజుల్లోనే దేశంలో పది కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకాలు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అమెరికాలో 85 రోజుల్లో కేవలం 9.2 కోట్ల మందికి, చైనాలో 6.1 కోట్ల మందికి మాత్రమే టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కొన్ని చోట్ల కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నా.. రోజువారిగా టీకా తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.