Tamil Nadu: మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు

* తమిళనాడులోని 10 జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ జారీ * ఇంకా జలదిగ్బంధంలోనే వందలాది ప్రాంతాలు

Update: 2021-11-10 05:00 GMT

తమిళనాడులో ఆగని వర్ష బీభత్సం(ఫైల్ ఫోటో)

Tamil Nadu: తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నైలో జనజీవనం అస్తవ్యస్థమయింది. ఇంకా జలదిగ్బంధంలోనే అనేక ప్రాంతాలు చిక్కుకున్నాయి. అటు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాల్లో తలదాచుకున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తమిళనాడులో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

డెల్టా జిల్లాలు కడలూరు, విల్లుపురం, పుదుకోట్టై, శివగంగ, రామనాథపురం, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. చెన్నై, తిరునల్వేలి, కన్యాకుమారి, తెంకాసి, విరుదునగర్, మధురై, చెంగల్‌పట్టు జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తమిళనాడులోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. IMD సూచనల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట్, కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, మైలాడుతురై వంటి 9 జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు రేపటి వరకు సెలవు ప్రకటించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ వాయుగుండంగా మారి తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కరుసే అవకాశాలున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News