Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
*అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం *రానున్న 4 రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించి, ఇవాళ నైరుతి బంగాళాఖాతం వద్ద దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, వీటి ప్రభావంతో రానున్న 4రోజులు ఏపీ, యానాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక కోస్తా ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని సూచించింది.
ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రానున్న రెండ్రోజులు కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.