Kolkata Doctor Rape And Murder Case: ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి ఓ లేఖ రాశారు. దేశంలో మహిళలపై లైంగిక దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయని తన లేఖ ద్వారా ఆందోళన వ్యక్తంచేసిన దీదీ.. మహిళలపై నేరాల నియంత్రణకు మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని డిమాండ్ చేశారు. కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం ఆందోళనలతో అట్టుడికింది. ముఖ్యంగా ఈ దుర్ఘటన అనంతరం జరిగిన పరిణామాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత అభాసుపాలు చేశాయి.
మరీ ముఖ్యంగా హత్యాచారం ఘటన జరిగిన తరువాత అక్కడ ఆందోళన చేస్తోన్న డాక్టర్లపై దాడి, ఆర్.జి. కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ విధ్వంసం వంటి ఘటనలు మమతా బెనర్జీ సర్కారు తీవ్ర విమర్శలపాలయ్యేలా చేశాయి. శాంతి భద్రతలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా అంటూ సుప్రీం కోర్టు సైతం మొట్టికాయలేసింది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జి ప్రధాని మోదీకి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే, మమతా బెనర్జి లేఖపై అక్కడి ప్రతిపక్షాల నుండి మరో వెర్షన్ వినిపిస్తోంది. ఈ ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాల మొత్తం క్రమంలో తమ ప్రభుత్వం ఎక్కడ అప్రతిష్టపాలవుతుందో ఏమోననే భయంతోనే డ్యామేజ్ కంట్రోల్ కోసం తీసుకునే చర్యల్లో భాగంగా మమతా బెనర్జి ఈ లేఖ రాశారని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.