Mamata Banerjee Video: ఇదే ఆఖరి ప్రయత్నంగా చెబుతున్నా.. డాక్టర్లతో మమతా బెనర్జి కీలక వ్యాఖ్యలు
Mamata Banerjee: కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటనని నిరసిస్తూ అక్కడి డాక్టర్లు నిరవధిక సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నా ముగించి విధుల్లో చేరాల్సిందిగా పలుమార్లు పశ్చిమ బెంగాల్ సర్కారుతో పాటు సుప్రీం కోర్టు కూడా చెప్పి చూశాయి. కానీ హత్యాచారానికి గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగడంతో పాటు డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని డాక్టర్లు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన స్వస్త్య భవన్ కి చేరుకున్నారు. అక్కడ ధర్నాలో కూర్చున్న డాక్టర్లతో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జి డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. డాక్టర్ల డిమాండ్స్‌పై తాను సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. ఎవరిదైనా తప్పు ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రోగుల కోసం ఏర్పాటు చేసిన పేషెంట్ వెల్ఫేర్ కమిటీలను తక్షణమే రద్దు చేస్తానని ప్రకటించారు. "తాను కూడా విద్యార్థి ఉద్యమాలు చేసే ఇక్కడివరకు వచ్చాను. జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను. అందుకే మీ బాధలు నేను అర్థం చేసుకోగలను. నేను నా ముఖ్యమంత్రి పదవి కోసం బాధపడటం లేదు. కానీ నిన్న రాత్రంతా ఇక్కడ వర్షం కురిసింది. అయినప్పటికీ మీరు వర్షంలో తడుస్తూనే ధర్నాలో కూర్చున్నారు. వర్షంలో తడుస్తు రోడ్లపై ధర్నాలు చేస్తోన్న మిమ్మల్ని చూసి తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. అందుకే తాను ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాలేదు.. మీ సోదరిగా వచ్చాను. మీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తాను" అంటూ మమతా బెనర్జి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సంక్షోభానికి తెరదించేందుకు ఇది తాను చేస్తోన్న ఆఖరి ప్రయత్నంగా మమతా బెనర్జి చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని చెప్పిన మరునాడు మమతా బెనర్జి చేసిన ఈ 'ఆఖరి ప్రయత్నం' వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.