LPG Cylinder: రైల్వే ట్రాక్ పై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్.. రైలు ప్రమాదాలకు స్కెచ్ వేస్తోంది ఎవరు?

Update: 2024-09-22 08:13 GMT

LPG Cylinder On Railway Tracks: రైల్వే ట్రాక్‌పై ఎల్పీజీ సిలిండర్ పెట్టి రైలు ప్రమాదానికి కుట్ర చేశారు. గుర్తుతెలియని దుండగులు చేసిన కుట్రను లోకోపైలట్ చాకచక్యంగా తిప్పికొట్టారు. వెంటనే లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి రైలును నిలిపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కాన్పూర్ నుండి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న గుడ్స్ రైలుకి ఈ ప్రమాదం తప్పింది. ప్రేమ్‌పూర్ స్టేషన్‌కి సమీపంలో ఆదివారం ఉదయం 5.50 గంటలకు ఈ ఘటన జరిగింది. లోకోపైలట్ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు... సిలిండర్‌ని పట్టాలపై నుండి తొలగించి రైలుకు మార్గం క్లియర్ చేశారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈ నెల ఆరంభంలో ప్రయాగ్‌రాజ్ నుండి భివాని వెళ్తున్న ఖాళింది ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. రైలు పట్టాలపై సిలిండర్ పెట్టి ఉండటం చూసిన లోకోపైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేశారు. అయినప్పటికీ కీసుమంటూ భారీ శబ్ధంతో ముందుకెళ్లిన రైలు, ఆ సిలిండర్‌ని ఢీకొట్టి ఆగిపోయింది. రైలు లోకోపైలట్ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు, ఆ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అనంతరం రైలుని అక్కడి నుండి పంపించేశారు.

ఈ తరహాలో ఇలా రైలు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలు పెట్టడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూసిన సందర్భాలున్నాయి. అందుకే ఎవరో రైల్వే శాఖపై, రైలు ప్రయాణికులపై భారీ కుట్రకు పన్నాగం వేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు, దాడులకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కీలకమైన రైల్వే లైన్ల వెంట నిఘాను పెంచే దిశగా రైల్వే శాఖ యోచిస్తోంది.

Tags:    

Similar News