Bay of Bengal: వాయుగుండంగా మారిన అల్పపీడనం
* కార్తెకల్-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం * సాయంత్రం కడలూరు సమీపాన తీరాన్ని దాటే అవకాశం
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఎక్కువగా చెన్నైపై కనపడుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారి, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బుధవారం రాత్రి 9 గంటలకు చెన్నైకి 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈరోజు సాయంత్రం శ్రీహరికోట-కరైకల్ మధ్య కడలూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే వరకు తమిళనాడుతో పాటు దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక నెల్లూరు, ప్రకాశంతోపాటు, చిత్తూరు, కడప జిల్లాల్లో కూడా సాధారణం నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు, కృష్ణా నుంచి విశాఖ వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం వాడరేవుల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో రెండురోజులు తీరం అల్లకల్లోలంగా ఉండనుంది.
గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు కోరారు.