జమ్మూ కాశ్మీర్‌లోని కృష్ణ ఘాటిలో పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘన జరిపాయి.. ఈ ఘటనలో భారత ఆర్మీ జవాన్ అమరవీరుడు అయ్యారని.. మరొకరు గాయపడ్డారని గురువారం నివేదికలు తెలిపాయి. అలాగే ఈ విషయాన్నీ జమ్మూ డిఫెన్స్ ప్రో, లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. నివేదికల ప్రకారం, గురువారం సుమారు 20.30 గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్లో కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది. అప్రజాస్వామికమైన, విచక్షణారహితంగా కాల్పులు జరిపింది పాకిస్తాన్.. అయితే ఇందుకు భారత సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకుంది.
అంతకుముందు సాయంత్రం, పాకిస్తాన్ దళాలు మాంకోట్ సెక్టార్ పూంచ్లో కాల్పుల విరమణ ఉల్లంఘనను ప్రారంభించాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి,1999 లో భారత్ పాక్ లు సంతకం చేసిన ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడుస్తూనే ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పాకిస్తాన్ నియంత్రణ రేఖపై 3,186 కు పైగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయి. ఇందులో మొత్తం 24 మంది పౌరులు మరణించారు.. 100 మందికి పైగా గాయపడ్డారు. సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలు మందు గుండు అంచున జీవితాన్ని గడుపుతున్నారు.