Mamata Banerjee To Doctors: మమతా బెనర్జీ ఇంటికి డాక్టర్స్.. ఆ ఒక్కటి అడగొద్దన్న సీఎం

Update: 2024-09-14 16:11 GMT

Mamata Banerjee To Doctors: కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్నా విరమించి విధుల్లో చేరాల్సిందిగా పిలుపునిస్తూ ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి డాక్టర్లని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని మమతా బెనర్జి హామినిచ్చారు. తాను ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాలేదని.. మీకు సోదరిగానే వచ్చానని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం స్వస్త భవన్ ఎదుట జరిగిన ధర్నా వద్ద డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మమతా బెనర్జి ఇచ్చిన పిలుపుతో సాయంత్రానికి డాక్టర్లు ఆమె అధికారిక నివాసం వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రితో కూర్చుని మాట్లాడటానికి తాము సిద్ధమేనని చెప్పిన డాక్టర్లు.. ఆ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రస్తుతం ఆర్.జి. కార్ మెడికల్ కాలేజ్ కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున.. తాను ఆ పని చేయలేనని మమతా తేల్చిచెప్పారు. తన పరిధిలో లేని ఆ ఒక్కటీ అడగొద్దని స్పష్టంచేసిన మమతా బెనర్జి.. అది కాకుండా సమావేశంలో చర్చించే ప్రతీ అంశాన్ని ధృవీకరిస్తూ మినట్స్ ఆఫ్ ది మీటింగ్ కాపీపై తాను సంతకం చేస్తానని అన్నారు.

అయితే, మమతా బెనర్జి ఎంత చెప్పినప్పటికీ.. లైవ్-స్ట్రీమింగ్ లేనిదే తాము చర్చలకు రావడం కుదరదు అని డాక్టర్లు తెగేసి చెప్పారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జి నివాసం బయట డాక్టర్స్ వర్షంలో నిలబడటం, వారిని లోపలికి ఆహ్వానిస్తూ ద్వారం వద్దే ఆమె వేచిచూడటం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో మమతా బెనర్జి స్పందిస్తూ.. మీరు తనని ఇలా అగౌరపర్చడం తగదని, కనీసం లోపలికి వచ్చి టీ తాగమని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News