Supreme Court: కోల్‌కతా హత్యాచార ఘటన కేసు విచారణ వాయిదా
Supreme Court: సెప్టెంబర్ 5కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Supreme Court: కోల్‌కతా హత్యాచార ఘటన కేసు విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసు విచారణలో బెంగాల్ పోలీసుల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. హత్యాచార ఘటన జరిగాక.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించింది. FIRకు ముందే పోస్టుమార్టం, శవ దహనం ఎలా చేస్తారని ధర్మాసనం నిలదీసింది. కోల్‌కతా పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది.
హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. ప్రజారోగ్య దృష్ట్య డాక్టర్లు వెంటనే విధులకు హాజరవ్వాలని కోరింది. వైద్యులకు భద్రతపై కేంద్రం సమావేశం నిర్వహించాలని, డాక్టర్ల భద్రతకు ప్రత్యేక మెకానిజం ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రులు సైతం సొంతంగా రక్షణ చర్యలు తీసుకోవాలంది. హాస్పిటల్స్‌లో వైద్యుల పనివేళలపైనా సమీక్షించాలని సూచించింది కోర్టు.
టాస్క్‌ఫోర్స్ కమిటీకి వైద్యులు తమ భద్రతకు సంబంధించి.. సలహాలు, సూచనలు ఇచ్చేలా పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వైద్యుల సంక్షేమం, భద్రతపై ఆందోళన చెందుతున్నామన్న సుప్రీంకోర్టు.. డాక్టర్ల శాంతియుత నిరసనలకు విఘాతం కలిగించొద్దని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. ఐతే విచారణ సందర్భంగా ఆర్‌జి కర్ కాలేజీ వద్ద CISFను మోహరించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం.