Kolkata Doctor Rape Case: కొల్‌కతా డాక్టర్ రేప్ కేస్.. విద్యార్థులపై లాఠీలు ఝుళిపించిన పోలీసులు
Kolkata Doctor Rape Case: టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించిన పోలీసులు
Kolkata Doctor Rape Case: వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతా రణరంగంగా మారింది. డాక్టర్ హత్యాచార ఘటనపై చేపట్టిన విద్యార్థుల చలో సెక్రటేరియట్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీని అడ్డుకునేందుకు 6వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సెక్రటేరియట్‌కు వెళ్లే దారుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తుగా రోడ్లు బ్లాక్ చేసి, వాటర్ కెనాన్‌లు సిద్ధం చేశారు. ర్యాలీ ప్రారంభించిన విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పోలీసులు చలో సెక్రటేరియట్ ర్యాలీని అడ్డుకోవడంతో కోల్‌కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసి ర్యాలీ కొనసాగించేందుకు విద్యార్థులు యత్నించారు. దాంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ఉపయోగించారు. పోలీసులను ఎదుర్కొనేందుకు విద్యార్థులు రాళ్లు రువ్వగా.. వారిపై లాఠీలు ఝుళిపించారు పోలీసులు.
మరోవైపు డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్ బీజేపీ ధర్నా చేపట్టింది. కోల్‌కతా పోలీస్ హెడక్వార్టర్స్ ముందు బైఠాయించారు బీజేపీ నేతలు. సీఎం మమత బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ స్లోగన్స్ ఇస్తూ ఆందోళన చేపట్టారు. అయితే బీజేపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లు తోసేందుకు బీజేపీ నేతలు యత్నించగా.. పోలీసులు వారిపై కూడా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇక హత్యాచార ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. రేపు బెంగాల్‌లో 12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది.