Kolkata Doctor Rape, Murder Case: మమతా బెనర్జికి ఊహించని షాకిచ్చిన బెంగాల్ డాక్టర్స్
Kolkata Doctor Rape And Murder Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసులో నిరసనలు కొనసాగిస్తున్న డాక్టర్లను చర్చలకు రావాల్సిందిగా పశ్చిమ బెంగాల్ సర్కారు ఆహ్వానించింది. డాక్టర్లతో కూర్చుని మాట్లాడుకుని వారితో ఆందోళన విరమింపజేద్దాం అని సీఎం మమతా బెనర్జి భావించారు. ఈమేరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ నుండి వారికి ఒక ఈమెయిల్ వెళ్లింది. కానీ ఆర్జీ కార్ హాస్పిటల్ ఉదంతం అనంతరం ఆగ్రహావేశాలతో ఉన్న డాక్టర్లు.. మమతా బెనర్జి సర్కారుకు తమదైన స్టైల్లో షాకిచ్చారు.
ఇంతకీ ప్రభుత్వం పంపించిన ఈమెయిల్‌లో ఏముంది..
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ డాక్టర్ల అసోసియేషన్‌కి ఈమెయిల్ చేస్తూ చర్చలకు సంబంధించిన అంశాన్ని అందులో ప్రస్తావించారు. 12 నుండి 15 మంది సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందం ఈ చర్చలకు రావాల్సిందిగా ఆ ఈమెయిల్‌లో కోరారు. రాష్ట్ర సచివాలయం నబన్నలో జరిగే ఈ సమావేశానికి డాక్టర్లు సానుకూల స్పందనతో వస్తే మరీ మంచిది అని పేర్కొన్నారు. అంతేకాదు.. ''ఈ నిరసనల్లో పాల్గొంటున్న డాక్టర్లు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలి'' అని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఈమెయిల్‌లో గుర్తుచేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరుపున ఎవరెవరు పాల్గొంటారు అనే విషయంలో మాత్రం మనోజ్ పంత్ స్పష్టత ఇవ్వలేదు.
డాక్టర్స్ ఇచ్చిన రిప్లై ఏంటంటే..
అయితే, చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ పంపించిన ఈమెయిల్ పట్ల విముఖత వ్యక్తంచేసిన డాక్టర్లు.. ఆయనకు రిప్లై ఇస్తూ తమ అభిప్రాయాన్ని బల్లగుద్ది మరీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ సర్కారుతో చర్చలకు డాక్టర్లు పలు షరతులు విధించారు. 30 మంది సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందాన్ని చర్చల్లో పాల్గొనేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ సమావేశానికి సీఎం మమతా బెనర్జి కూడా వచ్చి మాట్లాడాలి అని షరతు విధించారు. తమతో జరిపే చర్చలకు సంబంధించిన సమావేశాన్ని ప్రజలు అందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేయాలని అంతిమ షరతు పెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపించిన లేఖకు రిప్లై ఇచ్చారు. డాక్టర్లు విధించిన ఈ షరతులకు సీఎం మమతా బెనర్జి ఏమని స్పందిస్తారోననేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.