Kerala Floods: కేరళలో వరద బీభత్సం.. 15 మంది మృతి
Kerala Floods: కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. గతేడాది వరద బీభత్సం నుంచి పూర్తిగా కోలుకోకముందే వరణుడు మరోసారి కేరళపై కన్నేర్ర చేస్తున్నాడు.
Kerala Floods: కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. గతేడాది వరద బీభత్సం నుంచి పూర్తిగా కోలుకోకముందే వరణుడు మరోసారి కేరళపై కన్నేర్ర చేస్తున్నాడు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెరియార్ నది ప్రమాద స్థాయి దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని రాజమల ఏరియాలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ కొండచరియల కింద ఉన్న పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య 15కు చేరింది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక, ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన దాదాపు 80 మంది కార్మికులు గుడిసెలు ఏర్పాట్లు చేసుకుని నివాసముంటున్నారు. 15 మంది మృతదేహాలు శిథిలాల కింద వెలికితీయగా...మరో 57 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనా స్థలాల్లో రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో 12 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. వీరిలో ముగ్గురు తీవ్ర గాయాలకు గురైయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
ఎన్డీఆర్‌ఎఫ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి ప్రభుత్వమే పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తుందని సీఎం ఆదేశించారు.
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతుల రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో ఇతర జిల్లాల్లో కొండ దిగువ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.