Siddaramaiah: సిద్ధరామయ్యపై దర్యాప్తునకు కోర్టు ఆదేశాలు.. అసలేంటీ ముడా స్కామ్ వివాదం?

Update: 2024-09-25 11:05 GMT

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంచలనం సృష్టించిన ముడా స్కామ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశిస్తూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మైసూరు లోకాయుక్త పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు ముడా స్కామ్ ఆరోపణలతో ముడిపడి ఉన్న ఇతరులను అందరినీ ప్రశ్నించాల్సిందిగా ప్రజాప్రతినిధుల కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది. 3 నెలల్లోగా వారిని ప్రశ్నించి, పూర్తి నివేదిక అందించాల్సిందిగా కోర్టు తమ ఆదేశాల్లో స్పష్టంచేసింది.

ముడా (మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ) స్థలాల కేటాయింపుల్లో సిద్ధరామయ్య తన భార్య పార్వతికి అక్రమ పద్ధతిలో స్థలం కేటాయించి భారీ మొత్తంలో లాభం పొందారని అక్కడి ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే అంశంపై కర్ణాటకలోని ప్రతిపక్షాలు గతంలోనే ఆ రాష్ట్ర గవర్నర్‌ థావర్చంద్ గెహ్లట్‌కి కూడా ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై స్పందించిన గవర్నర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు అనుమతిస్తూ ఆగస్టు 19నే ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే, గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హై కోర్టులో ఆ మరునాడే పిటిషన్ దాఖలు చేశారు. సిద్ధరామయ్య పిటిషన్‌ని తోసిపుచ్చిన హైకోర్టు, ఆయనపై విచారణకు అనుమతిస్తూ సెప్టెంబర్ 24న ఉత్తర్వులు జారీచేసింది.

సిద్ధరామయ్య పిటిషన్ పై హై కోర్టు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో నేడు కర్ణాటకలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనపై విచారణకు ఆదేశించింది.

ముడా స్కామ్ కేసు సంగతేంటి?

మైసూరు అభివృద్ధి కోసం ముడా భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా ముడా అధికారులు మరోచోట స్థలాలు కేటాయించారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య భార్య బివి పార్వతి కూడా తనదిగా చెబుతున్న 3.16 ఎకరాల స్థలాన్ని ముడాకు ఇవ్వగా, అందుకు నష్టపరిహారంగా 50:50 పద్ధతిలో ముడా ఆమెకు మరోచోట భూమిని కేటాయించింది.

పార్వతి కోల్పోయినట్లుగా చెబుతున్న అసలు స్థలం మైసూరు తాలుకాలోని కాసరే గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 464 లో ఉంది. అయితే, అది అత్యంత సాధారణ ప్రాంతమని, కానీ ముడా ఆమెకు కేటాయించిన స్థలం అంతకుమించి ఎన్నో రెట్లు అధికం ఉంటుందని కర్ణాటకలోని బీజేపి నేతలు ఆరోపిస్తున్నారు.

మరో ఆరోపణ కూడా..

పార్వతి నష్టపోయినట్లుగా చెబుతున్న భూమి అసలు ఆమె పేరు మీదే లేదని ఇంకొంతమంది ఆరోపిస్తున్నారు. లేని భూమిని ఉన్నట్లుగా చూపించి, దానికి నష్టపరిహారంగా ఖరీదైన భూమిని కాజేశారనేది వారి ఆరోపణ. 

ఈ భిన్నారోపణల నేపథ్యంలోనే సామాజిక కార్యకర్త స్నేహమయి క్రిష్ణ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ స్థలాల బదలాయింపులో ఎంతమేరకు చట్టబద్ధత ఉందో నిగ్గుతేల్చాల్సిందిగా కోరుతూ స్నేహమయి క్రిష్ణ తన ప్రైవేటు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News