కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేష్ విశ్వనాథ కత్తి గుండెపోటుతో మృతి
Karnataka: బెలగాని జిల్లా హుక్కేరి నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉమేష్
Karnataka: కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. మంత్రి ఉమేష్ కత్తి.. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో బాత్‌రూమ్‌లో రాత్రి స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఉమేష్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఉమేష్ కత్తికి ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంత్రి ఉమేష్ కత్తి మరణంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
బెలగావి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులలో ఒకరైన ఉమేష్ కత్తి హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలించారు. ఆయన అంతకుముందు ముఖ్యమంత్రి కావాలనే కోరికను సైతం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రత్యేక ఉత్తర-కర్ణాటక రాష్ట్ర హోదా కోసం తరచుగా వార్తల్లో నిలిచేవారు.
1985లో తన తండ్రి విశ్వనాథ్ కత్తి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో బీజేపీలో చేరడానికి ముందు కత్తి జనతాపార్టీ, జనతాదళ్, జేడీ యూ, జేడీఎస్‌లలో పలు హోదాల్లో పనిచేశారు. గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడ్యూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు.
ఉమేష్ కత్తి మృతదేహాన్ని ఎయిర్ అంబులెన్స్‌లో స్వగృహానికి తరలించనున్నారు. సంకేశ్వరలో మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శన తర్వాత అన్ని ప్రక్రియలు జరుగనున్నాయి. బాగేవాడి బెళగావిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉమేష్ కత్తి మృతితో బెళగావిలోని పాఠశాలలు, కళాశాలలకు కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించింది.