Karnataka Elections: కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Karnataka Elections: మహిళల కోసం పింక్ బూత్‌లు ఏర్పాటు
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు వరకు జరుగుతుంది. మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బూతులు ఏర్పాటు చేశారు. కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 5కోట్ల 31 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 30వేల పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేయనున్నారు. మొత్తం 224 స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. 2వేల 615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 58 వేల 545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క బెంగళూరులోనే 8వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిసారి ఓట్ ఫ్రమ్ హోం విధానాన్ని ఈసీ ప్రవేశపెట్టింది. సుమారు 4 లక్షల మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 75వేల 603 బ్యాలెట్ యూనిట్లు, 70 వేల300 కంట్రోల్ యూనిట్లు, 76వేల 202 వీవీప్యాట్లు వినియోగించనున్నారు.
ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1.56 లక్షల మంది పోలీసులను బందోబస్తులో పాల్గొంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమందిని ఎన్నికల భద్రతకు కేటాయించడం ఇదే తొలిసారని పోలీసుశాఖ వెల్లడించింది. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. ఓటర్లు పెద్దసంఖ్యలో బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపిచ్చారు.
ఇంకోవైపు.. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించాయి. పలు చిన్న పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ఈ మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ మొత్తం 224 స్థానాలకు, కాంగ్రెస్ 223, జేడీఎస్ 207 చోట్ల అభ్యర్థులను నిలిపాయి. 1985 నుంచి 38 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ ఆనవాయితీని బద్దలు కొట్టి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భారీఎత్తున ప్రచారం నిర్వహించింది. అటు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని హోరెత్తించింది. ఇక రాష్ట్రంలో హంగ్ ఖాయమని.. 35-40 స్థానాలు సాధించి మళ్లీ కింగ్‌మేకర్ అవ్వాలని జేడీఎస్ తహతహలాడుతోంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా 379.36 కోట్ల విలువైన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.