Janatha Curfew: నిరుడు మార్చి 22న జనతా కర్ఫ్యూ
Janatha Curfew: ఆపై దేశ వ్యాప్తంగా విడతలవారీగా లాక్‌డౌన్ అమలు * జూన్ 1 తర్వాత అదే స్థాయిలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం
Janatha Curfew: కరోనా వైరస్ దెబ్బకు దేశమంతా తొలిసారి జనతా కర్ఫ్యూ ప్రకటించి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది అవుతోంది. మార్చి 22న కొవిడ్ వ్యాప్తిపై అవగాహనతో పాటు, వైద్యులకు సంఘీభావం తెలిపేందుకు ప్రధాని మోడీ ఒకరోజు జనతా కర్ఫ్యూ విధించారు. కానీ, తెలంగాణలో మాత్రం మార్చి 23 నుంచి 31 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ రోజు రాష్ట్రంలో కొత్తగా ఐదు పాజిటివ్‌లు నమోదు కావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. సరిహద్దులను కూడా మూసేసి, రాకపోకలను నిషేధించింది. కాగా మార్చి 25 నుంచి కేంద్ర ప్రభుత్వమే 23 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌ను విధించింది. అనంతరం రెండో విడతలో ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు, మూడో విడతలో మే 4 నుంచి 17 వరకు, చివరిగా మే 18 నుంచి 31 వరకు దాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఆ తర్వాత జూన్ 1 నుంచి అన్‌లాక్‌ప్రక్రియను ప్రారంభించి, దశలవారీగా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
నిరుడు దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ప్రారంభమవ్వగా, నవంబరు నాటికి తీవ్రత తగ్గింది. మళ్లీ ఇప్పుడు వైరస్ విజృంభిస్తోంది. ప్రధానంగా పొరుగున ఉన్న మహారాష్ట్రలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లోకల్ ట్రైన్స్‌తో పాటు, జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నట్లు తేలింది. మన దగ్గర కూడా విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకులాల్లో వైరస్ వ్యాప్తి ఇటీవల బాగా పెరిగింది. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, సమూహాలుగా ఉండటం, టీకా తీసుకునేందుకు సంకోచించడంతో వైరస్ మళ్లీ విజృంభిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఏడాది నాటి పరిస్థితులు కొన్ని రాష్ట్రాలో నెలకొన్నాయి. కొన్నిచోట్ల పూర్థిస్థాయిలో లాక్‌డౌన్ విధిస్తుండగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా కర్ప్యూలాంటి చర్యలకు ఆయా రాష్ట్రాలు దిగుతున్నాయి.
తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ భారీగా కేసులు పెరిగినా, సర్కారుకు లాక్‌డౌన్ విధించాలన్న ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబోమని అధికారి వెల్లడించారు. గతంలోనే లక్ష కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన చేసుకున్నామని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు రాకపోవచ్చని అంటున్నారు. తాజాగా రాష్ట్రంలో పది ప్రాంతాల్లో వైరస్ అవుట్ బ్రేకు అవ్వగా, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా విస్తృతమైన టెస్టులు చేసి కట్టడి చేయగలిగారు. గతంలో సర్కారు చేపట్టిన చర్యల వల్ల తెలంగాణలో 1.44 లక్షల కేసులు రాకుండా ఆపడంతో పాటు, 2300 మరణాలు నివారించగలిగిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో కూడా వెల్లడించిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.