మంగళయాన్ ప్రస్థానం సమాప్తం.. 8ఏళ్ల పాటు సేవలందించిన ఉపగ్రహం

*2013లో రూ.450 కోట్లతో మంగళయాన్‌ను చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ

Update: 2022-10-03 03:09 GMT

మంగళయాన్ ప్రస్థానం సమాప్తం.. 8ఏళ్ల పాటు సేవలందించిన ఉపగ్రహం

End of Mangalyaan Mission: అంగారకుడిపై పరిశోధనలకు భారత్‌ పంపిన తొలి ఉపగ్రహం మంగళయాన్‌ సేవలు ఇక ఆగిపోనున్నాయి. వ్యోమనౌకలోని ఇంధనం, బ్యాటరీ.. సురక్షిత స్థాయి నుంచి దిగువకు పడిపోయాయి. మంగళయాన్ ఉపగ్రహం సేవలకు తెరపడినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉపగ్రహంలో ఇంధనం అయిపోయిందని, బ్యాటరీ డ్రై అవ్వడంతో.. లింక్‌ తెగిపోయిన్టటు తెలిసింది. అయితే ఈ విషయమై అధికారికంగా ఇస్రో ఎలాంటి ప్రకటనా చేయలేదు. 450 కోట్ల రూపాయలతో చేపట్టిన మంగళయాన్‌ ఉపగ్రహాన్ని 2013 నవంబరు 5న PSLV-C25 రాకెట్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది. 2014 సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి.. భారత్‌ రికార్డు సృష్టించింది. తొలి ప్రయత్నంలోనే అంగారకుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన దేశంగా.. భారత్‌ నిలిచింది.

నిజానికి మంగళయాన్‌ ఉపగ్రహాన్ని ఆరునెలల పాటు మాత్రమే పనిచేలా రూపొందించారు. కానీ.. అంచనాలకు మించి.. ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందించింది. అంగారకుడికి సంబంధించిన 8వేలకు పైగా చిత్రాలను పంపింది. అంగారకుడి అట్లాస్‌ను ఈ ఉపగ్రహం అందించింది. మంగళయాన్‌ ఉపగ్రహంలో మొత్తం 15 కేజీల బరువైన వివిధ పరీక్షలకు సంబంధించిన సాంకేతిక పరికరాలను అమర్చారు. అందులో మార్స్‌ కలర్‌ కెమెరా, థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ స్పెక్టోమీటర్‌, అంగారకుడిపై మీథేన్‌ను గుర్తించే సెన్సార్‌, లైమాన్‌ అల్ఫా ఫొటో మీటర్‌ వంటి వాటిని అమర్చారు. వీటి ద్వారా అంగారకుడి ఉపరితలం, మార్స్‌ స్వరూపం, అక్కడి ఉష్ణోగ్రత, వాతావరణం తెలుసుకునే అవకాశం లభించింది.

ఇదిలా ఉంటే.. అసలు మంగళయాన్‌ గ్రహంలో బ్యాటరీ త్వరగా అయిపోవడానికి గ్రహణ పరిస్థితులే కారణమని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. అంగారకుడిపై ఏర్పడే గ్రహణాన్ని ఉపగ్రహంలోని బ్యాటరీలు గంటన్నర మాత్రమే తట్టుకునేలా రూపొందించారు. గంటన్నరకు మించి.. సూర్యకాంతి లభించకపోతే.. ఆ బ్యాటరీలు డ్రెయిన‌ అవుతాయి. బ్యాటరీలో చార్జింగ్‌ సురక్షిత స్థాయి కంటే దిగువకు పడిపోతాయి. అయితే ఇటీవల అంగారుకుడిపై వరుసగా గ్రహణ పరిస్థితులు సంభవించడంతో వాటిని తప్పించుకునేందుకు పలుమార్లు ఉపగ్రహ కక్ష్యను మార్చాల్సి వచ్చింది. ఫలితంగా ఉపగ్రహంలోని బ్యాటరీల్లో ఇంధనం త్వరగా డ్రెయిన్ అయినట్టు ఇస్రో వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులతో భవిష్యత్తు మంగళయాన్‌ యాత్రకు ఉపకరిస్తాయని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. రాబోయే రోజుల్లో గగన్‌యాన్, చంద్రయాన్‌-3తో పాటు ఆదిత్య-ఎల్‌1 ప్రాజెక్టులను ఇస్రో చేపట్టనున్నది. 

Tags:    

Similar News