సామాన్యుడిపై ద్రవ్యోల్బణం పిడుగు.. తినలేం.. తిరగలేం.. ఇల్లు కట్టలేం.. అద్దెకు ఉండలేం
ధరల నియంత్రణను గాలికొదిలిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Inflation: ద్రవ్యోల్బణం లాంటి పెద్ద పెద్ద మాటలకు అర్థాలు తెలియని సామాన్యుడి బతుకు.. పెరుగుతున్న ధరలతో భారంగా మారింది! తెల్లవారుజామున నిద్రలేవగానే కొనుక్కొచ్చుకునే పాల దగ్గర నుంచి.. పొద్దుపోయేదాకా ఏ వస్తువు కొనాలన్నా వాటి ధరలు వినగానే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. ధరాభారం పెరిగిపోవడంతో పేద, దిగువమధ్యతరగతి, మధ్యతరగతి జీవనం దుర్భరంగా మారింది.
ధరలపై నియంత్రణను ప్రభుత్వాలు గాలికొదిలేయడంతో ప్రజలకు దినమొక గండంలా మారిపోయింది. బతుకు భారమైపోయింది. పప్పు, ఉప్పు, నూనె, చింతపండు, బియ్యం, కూరల ధరలు మండిపోతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అన్నిటికీ మించి.. వంటగ్యాసు మంటెక్కిస్తోంది. గత మూడేళ్లలో స్టీలు, సిమెంటు, ఇసుక ధరలు భారీగా పెరిగిపోవడంతో.. భూములు ఉన్నవారు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి! పెరిగిన అద్దెలు భరించలేని మధ్యతరగతి వారి కష్టాలు మరిన్ని!! వంటింటి నుంచి మొదలుపెడితే.. పేద, గొప్ప తారతమ్యం లేకుండా అందరికీ ఆకలి తీర్చేది అన్నం. కానీ.. బియ్యం ధరలు గడిచిన రెండు నెలల్లో అమాంతం పెరిగాయి. రెండు నెలల క్రితం దాకా క్వింటాకు రూ.4,200గా ఉండే హెచ్‌ఎంటీ బియ్యం ధర రూ.5,100 వరకు చేరింది. క్వింటా బీపీటీ బియ్యం ధర రూ.3,600 నుంచి రూ.4,200కు పెరిగింది. జైశ్రీరామ్ వెరైటీ బియ్యం ధర రూ.4,400 నుంచి రూ.5,800కు పెరిగింది. బియ్యం వ్యాపారులు, ఎగుమతిదారులు సిండికేట్‌గా ఏర్పడి బియ్యం మార్కెట్‌ను శాసిస్తున్నారని, ధరలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మార్కెట్లో చర్చ జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నూకల ఎగుమతిని పూర్తిగా నిషేధించగా.. బియ్యం ఎగుమతులపై 20 శాతం పన్ను విధించింది. దీంతో బియ్యం ధరలకు కళ్లెం పడింది. ధరలు పెద్దగా తగ్గకపోయినా.. మరింత పెరగకుండా ఆగాయి. వ్యాపారులు అంత సులువుగా బియ్యం ధరలు తగ్గించటానికి ఇష్టపడట్లేదు. ఇక పప్పుల విషయానికి వస్తే.. రూ.90-95 మధ్య ఉండే కందిపప్పు ధర రూ.115కు చేరింది. పెసర పప్పు కిలో రూ.105, మినపపప్పు రూ.115గా ఉన్నాయి. శనగ పప్పు ధర కూడా రూ.70కి పెరిగింది. శనగ పప్పు, ఎర్ర పప్పు మినహా ఇతర అన్ని రకాల పప్పుల ధరలూ సెంచరీ దాటాయి.
తెలంగాణలో కంది పప్పు వినియోగం నెలకు 10 నుంచి 12 వేల టన్నుల దాకా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా! దక్షిణాది రాష్ట్రాల్లో కందిపప్పు వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆస్థాయిలో ఉత్పత్తి ఉండట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కంది విస్తీర్ణం, ఉత్పత్తి పెంచటానికి ఎంత ప్రయత్నించినా రైతుల నుంచి స్పందన రావట్లేదు. ఇతర పప్పుల సాగు జోలికి పోవట్లేదు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి పప్పులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా రవాణా చార్జీల భారం అదనంగా 30 శాతం దాకా పడుతోంది. ఇక.. ఈ నెలలో మొదటి పదిరోజులూ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడడంతో కోతకు వచ్చిన వివిధ రకాల కూరగాయల పంటలు దెబ్బతిని వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రైతుబజార్ల నుంచి సూపర్‌మార్కెట్ల దాకా అన్ని చోట్లా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.
నూనెలు.. ఇంకా తగ్గాల్సిందే!
మార్చి నెలలో బ్రాండెడ్ వంటనూనెల ధర లీటరుకు సగటున రూ.133 దాకా ఉండేది. మే నెలకు వచ్చేసరికి అది రూ.190 నుంచి రూ.192 దాకా చేరింది. పొద్దుతిరుగుడు, సోయా నూనెలపై రెండేళ్లపాటు దిగుమతి సుంకం ఎత్తివేయటంతో నూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే వ్యవసాయ సుంకం పేరుతో విధిస్తున్న 5 శాతం ప్రత్యేక సెస్ కూడా ఈ రెండు ముడి వంటనూనెలకు వర్తించదని ప్రభుత్వం ఆదేశాలివ్వటంతో ధరలు లీటరుకు రూ.40-45 మేర తగ్గాయి. ప్రస్తుతం పొద్దుతిరుగుడు నూనె ధర రూ.155గా ఉంది. అయితే ఆయిల్ వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి ధర తగ్గకుండా చూస్తున్నారని.. దిగుమతి సుంకాల ఎత్తివేత, క్రూడాయిల్ ధరల ప్రకారం చూస్తే పొద్దుతిరుగుడు నూనె ధర రూ.140, పల్లీ నూనె ధర రూ.135-140 మధ్య మాత్రమే ఉండాలని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. పల్లీ నూనె ధర ఇదివరకు రూ. 180 నుంచి రూ. 190 ఉండగా... ఇప్పుడు రూ.155 ఉంది. ఇక పాల ధరలూ భారీగా పెరిగాయి.
నిర్మాణం.. భారం..నిర్మాణ వ్యయం ప్రతి చదరపుటడుగుకు మూడేళ్ల కిందట రూ.1000 ఉండగా.. అది ఇప్పుడు రూ.1600కు చేరింది. మూడేళ్ల క్రితం ధరలతో పోలిస్తే స్టీలు, సిమెంటు, ఇసుక ధరలు 50% మేర పెరగడమే ఇందుకు కారణం. అప్పట్లో రూ.250-260 దాకా ఉన్న 50 కిలోల సిమెంట్ బస్తా ధర ఇప్పుడు రూ.330-360కి చేరింది. రూ.2500గా ఉన్న టన్ను ఇసుక ధర.. రూ.4 వేలకు చేరింది. టన్ను స్టీల్ ధర రూ.32 వేల నుంచి రూ.68-77 వేలకు చేరింది. పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్త్రీలకు ఇచ్చే డబ్బు రోజుకు రూ.650 నుంచి దాదాపు రూ.1000కి పెరగ్గా.. కూలీలకు ఇచ్చేది రూ.400 నుంచి రూ.800కు చేరింది. రిజిస్ట్రేషన్ విలువలు కూడా పెరగడంతో.. కొత్తగా ఇల్లు కట్టుకునేవారి వెన్ను విరుగుతోంది! పోనీ అద్దెకు ఉందామా అంటే.. మూడేళ్ల క్రితం ఒక మంచి కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె రూ.15000 దాకా ఉండగా.. ఇప్పుడది రూ.18 వేలకు చేరింది. సింగిల్ బెడ్‌రూమ్ అద్దె రూ.9000 నుంచి రూ.12 వేలకు చేరింది. త్రిబుల్ బెడ్‌రూమ్ అద్దె రూ.25-30 వేలకు చేరింది. ఇంటి అద్దెపై కూడా జీఎస్టీని ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో.. అది అమలైతే అద్దెలు శిరోభారంగా మారనున్నాయి.