Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో ముగిసిన భారత ప్రస్థానం

Paris Olympics 2024: ఇవాళ రాత్రి 12.30కు ముగియనున్న ఒలింపిక్స్

Update: 2024-08-11 07:47 GMT

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో ముగిసిన భారత ప్రస్థానం

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శన ముగిసింది. పది పతకాల లక్ష్యంతో బరిలోకి దిగినా..ఆఖరుకు ఆరింటితోనే సరిపెట్టుకుంది. చివరి రోజు పోటీల్లో పతక ఆశలతో బరిలోకి దిగిన రెజ్లర్‌ రీతిక హుడా మహిళల 76కేజీ ఫ్రీస్టయిల్‌ క్వార్టర్స్‌లో ఓడింది.

అయితే ప్రీక్వార్టర్స్‌లో ప్రత్యర్థిపై 12-2 తేడాతో నెగ్గిన ఆమె భారత్‌ నుంచి ఈ విభాగంలో క్వార్టర్స్‌లో ప్రవేశించిన తొలి రెజ్లర్‌గానూ అదుర్స్‌ అనిపించుకుంది. కానీ, కీలక బౌట్‌లో టాప్‌ సీడ్‌ ఐపెరిని ఎంతగా నిలువరించినా అదృష్టం వరించలేదు. ఇక రెపిచేజ్‌పై ఆశలు పెట్టుకున్నా.. సెమీ్‌సలో ఐపెరి ఓడడంతో రీతికకు చాన్స్‌ దక్కలేదు. అటు గోల్ఫర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు.

ఈ ఒలింపిక్స్‌లో ఓ క్రీడాకారిణిపై వేటు పడింది. తమ దేశంలో మహిళల దుర్భర పరిస్థితిని విశ్వ క్రీడా వేదికపై ఎలుగెత్తి చాటిన అఫ్ఘాన్‌ బ్రేక్‌ డ్యాన్సర్‌ మనీజా తల్ష్‌పై అనర్హత వేటు పడింది. శుక్రవారం జరిగిన బ్రేకింగ్‌ ఈవెంట్‌ ప్రీ క్వాలిఫయర్‌ ఈవెంట్‌లో ఆమె నెదర్లాండ్స్‌ డ్యాన్సర్‌ ఇండియా సర్జో చేతిలో ఓడింది.

ఆ తర్వాత అఫ్ఘాన్‌ మహిళలకు స్వేచ్ఛ కల్పించాలనే స్లోగన్‌తో కూడిన బ్యానర్‌ను ధరించి కలకలం రేపింది. అయితే ఒలింపిక్‌ రూల్స్‌ ప్రకారం క్రీడల్లో రాజకీయ, మతపరమైన నినాదాలను ప్రదర్శించకూడదు. దీంతో క్రమశిక్షణ చర్య కింద తలాష్‌ను డిస్‌క్వాలిఫై చేసినట్టు ప్రపంచ డ్యాన్స్‌ స్పోర్ట్స్‌ సమాఖ్య ప్రకటించింది.

ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకంతో అదరగొట్టిన భారత హాకీ జట్టుకు స్వదేశంలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. నిన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొన్న హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేనపై పూలవర్షం కురిపించిన ఫ్యాన్స్‌.. డప్పులు మోగిస్తూ, డ్యాన్సులు చేస్తూ ఘనస్వాగతం పలికారు. కాంస్య పతక పోరులో భారత్‌ 2-1తో స్పెయిన్‌ ఓడించింది. టోక్యో క్రీడల్లో కూడా టీమిండియా కంచు మోత మోగించింది. అయితే, కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌.. షూటర్‌ మను భాకర్‌తో కలసి ముగింపోత్సవంలో పతాకధారిగా వ్యవహరించనున్నాడు.

అమిత్‌ రోహిదాస్‌, రాజ్‌కుమార్‌ పాల్‌, అభిషేక్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌, సంజయ్‌ కూడా శ్రీజేష్‌తో పాటు ఉండిపోయారు. వీరు కార్యక్రమం ముగిసిన తర్వాత మిగతా భారత అథ్లెట్లతో కలసి స్వదేశానికి చేరుకోనున్నారు. అపూర్వ స్వాగతం ఎంతో ఆనందం కలిగించిందని హర్మన్‌ప్రీత్‌ చెప్పాడు. భారత హాకీ మళ్లీ గాడినపడిందనే భావన ప్రజల్లో కలిగిందన్నాడు.

Tags:    

Similar News