తీర రక్షణ దళంలోకి ఏఎల్‌హెచ్-3 హెలికాప్టర్లు.. పోరుబందర్ పోర్టులో ప్రారంభించిన కోస్టల్ గార్డ్ చీఫ్ పథానియా
Indian Coast Guard: హెచ్‌ఏఎల్ ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ
Indian Coast Guard: తీర ప్రాంతంలో చొరబాట్లు, స్మగ్లింగ్‌లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. భారత తీర ప్రాంతంలోని గస్తీని మరింత బలోపేతం చేసేందుకు అత్యాధునిక అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. తీర ప్రాంత రక్షణ దళానికి స్వదేశీంలో తయారుచేసిన 16 ఏఎల్‌హెచ్ 3 హెలికాప్టర్లను ఇవ్వాలని సంకల్పించింది. హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ 13 ఏఎల్‌హెచ్ 3 హెలికాప్టర్లను సిద్ధం చేసింది. తాజాగా భారత తీర రక్షక దళం చీఫ్ వీఎస్ పథానియా గుజరాత్‌లోని పోర్‌బందర్ పోర్టులో ప్రారంభించారు. ఈ హెలికాప్టర్లతో సముద్ర తీర ప్రాంత భద్రత, నిఘా మరింత పటిష్ఠమవుతుందని పథానియా తెలిపారు. ఈ హెలికాప్టర్లను 12.7 మిల్లీమీటర్ల హెవీ మెషిన్ గన్‌ను ఉపయోగించేలా నిర్మించారు.
జూన్ 20న చెన్నైలోని ఎయిర్ స్టేషన్‌లో ఈ కొత్త హెలికాప్టర్లను మోహరించారు. అరేబియా సముద్రం ద్వారా.. పాకిస్థాన్ నుంచి పడవల్లో భారీగా హెరాయిన్‌ను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను పటిష్ఠం చేసి.. స్మగ్లర్ల ఆటను కట్టించాలని తీరప్రాంత రక్షణ దళానికి కేంద్రం ఈ అడ్వాన్స్ లైట్ 3 హెలికాప్టర్లను అందజేసింది. వీటిలో చొరబాట్లను గుర్తించే అధునాతన సెన్సార్లను అమర్చారు. అంతేకాదు.. ఈ ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లకు ఏకకాలంలోనే బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఈ హెలికాప్టర్లలో అత్యాధునిక రాడర్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ పరికరాలు ఉంటాయి. 24 గంల సముద్ర నిఘా, సుదూర శోధన, రెస్క్యూ కార్యకలాపాలు నిర్వహించగలదు. మేకింగ్ ఇండియాలో భాగంగానే వీటిని హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ నిర్మించినట్టు కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.