India Corona Updates: ఇండియాలో కరోనా విలయతాండవం...గత 24 గంటల్లో 2,624 మంది మృతి
India Corona Updates: గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,46,786 కరోనా కేసులు నమోదు కాగా 2,624 మంది ప్రాణాలు కోల్పోయారు.
India Corona Updates: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఒకవైపు వాక్సినేషన్ కొనసాగుతున్నా.. మరోవైపు.. కొవిడ్ కేసులు మాత్రం ఆగడం లేదు.. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య వాయు వేగంతో పెరుగుతోంది. వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గగడిచిన 24 గంటల్లో 17,53,569 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా..3,46,786 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. వరుసగా మూడో రోజు కేసుల సంఖ్య 3 లక్షల పైనే ఉంది. ఇక మరణాలు కూడా భారీ స్థాయిలోనే ఉండటం భయాందోళనకు గురిచేస్తోంది. నిన్న 2,624 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481 చేరగా, ఇప్పటివరకు 1,89,544 మంది ప్రాణాలు విడిచారు.
క్రియాశీల కేసులు 25 లక్షలకు పై మాటే...
క్రియాశీల కేసులు 25 లక్షలకు పైబడ్డాయి. మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 14.93శాతానికి పెరిగింది. ఆక్సిజన్, పడకల కొరత అంటూ వార్తలు వస్తోన్న తరుణంలో ఈ కేసుల పెరుగుదల భారత్‌కు గట్టిదెబ్బే. అయితే నిన్న ఒక్కరోజే 2,19,838 మంది కొవిడ్ నుంచి కోలుకోవడం కాస్త సానుకూల పరిణామం. మొత్తంగా కోటీ 38లక్షల మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 83.92 శాతానికి పడిపోయింది. ఇక, దేశవ్యాప్తంగా నిన్న 29,01,412 మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 13,83,79,832 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.
భారీగా పెరుగుతున్నమరణాలు...
దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు వేలకు పైగా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 6వందల 24మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య లక్షా 89వేల 544 కి చేరింది.. దేశ వ్యాప్తంగా కోవిడ్ ను జయించిన వారి సంఖ్య కోటి 38 లక్షలకు పైగా ఉన్నాయి. ఇప్పటి వరకు 13 కోట్ల 83లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి అత్యధిక కోవిడ్ -19 కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.
ఇతర ప్రాంతాల్లో..
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రాణాంతకంగా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో ఒక్కరోజే 28,395 మందికి వైరస్ సోకింది. తాజాగా శుక్రవారం 24,331 మంది కరోనా బారిన పడగా.. 348 మరణాలు సంభవించాయి. కరోనా గుప్పిట్లో చిక్కుకున్న మహారాష్ట్రలో తాజాగా 773 మంది ప్రాణాలు విడిచారు. 66,836 మంది వైరస్ బారినపడ్డారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 41.61లక్షలకు పైబడింది. దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.