Heavy Rains: మరోసారి తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు
* చెన్నై సహా తీర ప్రాంతాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ * వరద బాధితుల కోసం 109 సహాయక కేంద్రాల ఏర్పాటు
Heavy Rains: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. భారత వాతావరణ శాఖ చెన్నై సహా తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నైసహా తూత్తుకుడి, తిరునల్వేలి, విరుద్‌నగర్, శివగంగ, దిండిగుల్, మధురైలోని ఆయా ప్రాంతాలు నీటమునిగాయి.
ఇక భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది మరణించినట్లు తమిళనాడు సర్కార్ ప్రకటించింది. వరద బాధితుల కోసం మొత్తం 109 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చింగ్లేపేట, కాంచీపురంలో రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు కేప్ కొమోరిన్, శ్రీలంక తీరం మీదుగా తుపాను ఆవరించి ఉందని, దీంతో తమిళనాడు తీరంలో బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయంది. జాలరులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచనలు చేసింది.
దీంతోపాటు దక్షిణ అండమాన్ సముద్రంలో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం చెన్నైతోసహా 21 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది. ఇదే సమయంలో సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ ఆర్‌ఎన్ రవితో సమావేశమై వర్ష బీభత్సంపై పరిస్థితిని వివరించారు.