India-China Standoff Updates: భారత్, చైనా మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తత.. పీవోకేలో చైనా వాయుసేన కార్యకలాపాలు..
India-China Standoff Updates: భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో సమసిపోయే అవకాశాలు కనపడడంలేదు.
India-China Standoff Updates: భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో సమసిపోయే అవకాశాలు కనపడడంలేదు. జూన్ 15న గాల్వన్ లోయలో భారత్ - చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో 21 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. అయితే, చైనా వ్యూహంతో ఈ ఘర్షణలకు పాల్పడిందని నిరూపించే ఆధారాలు లభ్యం అవుతున్నాయి. గాల్వన్ ఘర్షణలకు కొద్ది ముందు భారత సరిహద్దుల్లో పర్వతారోహకులు, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న బలగాలను రంగంలోకి దింపిందని సమాచారం. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత్, చైనా మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
అయితే, అనంతరం జరిగిన చర్చల్లో ఒకమాట, చేతల్లో ఒక తీరు కనబర్చుతోన్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బేస్‌ల నుంచి భారీగా ఆయుధ వ్యవస్థలు లడఖ్ చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థను చైనా సరిహద్దులకు తరలించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో
వాయుసేన స్థావరంలో గత వారం చైనాకు చెందిన ఐఎల్-78 ట్యాంకర్ విమానాన్ని ఇండియా గుర్తించింది. ఈ విమానం యుద్ధవిమానాలకు గాల్లో ఇంధనం నింపుతుంది. తూర్పు లద్దాక్‌లో చైనా వాయుసేన కార్యకలాపాలు మరింత విస్తృతమయ్యాయి. ఈ నేపథ్యంలో వాటికి మద్దతుగా పీవోకేలోని స్కర్దూను కూడా ఉపయోగించుకొనే అవకాశం ఉంది.
గత ఏడాదే స్కర్దూ స్థావరాన్ని జే 17 విమానాలకు అనువుగా ఉండేలా పాకిస్థాన్ అభివృద్ధి చేసింది. టిబెట్ వంటి ప్రాంతాల నుంచి యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచి, అక్కడి నుంచి వాటిని తీసుకెళ్లడం క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇందుకు వినియోగించుకోవాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అత్యవసరంగా 21 మిగ్29లు, 12 సుఖోయ్‌లు కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్‌డీ 33 ఇంజిన్‌ను ఉపయోగించారు. వీటిలో భూమిపై దాడులకు, నౌకాదళంలో వినియోగించేలా మార్పులు చేశారు. ఇప్పటికే 270 సుఖోయ్‌లు ఉండటం కొత్తగా వాటిని భారీ సంఖ్యలో తీసుకోవడంలేదు. ఎల్‌ఏసీ వెంట చైనా యుద్ధవిమానాల కదలికలు పెరిగినట్లు ఇప్పటికే గుర్తించిన భారత్.. సైన్యంతో పాటు వైమానిక దళం కూడా గగన రక్షణ వ్యవస్థలను మోహరించింది.
కాగా.. మిత్ర దేశాలైన జపాన్, భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాలను బలోపేతం చేసేందుకు అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2021 ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం కింద ఈ మూడు దేశాల యుద్ధపైలట్లకు అమెరికాలోని గువామ్ స్థావరంలో శిక్షణ ఇవ్వనున్నారు.