Immigration Bill: లోక్‌సభలో సంచలన బిల్లు.. అక్రమ వలసదారుల్లో మొదలైన వణుకు!
Immigration Bill: ఇమ్మిగ్రేషన్ బిల్లుతో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు.

Immigration Bill: ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ను లోక్‌సభలో ఆమోదించిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులను ఇకపై తట్టుకోబోమని స్పష్టం చేశారు. భారత్‌ను అభివృద్ధి దిశగా నడిపించే ఉద్దేశంతో వచ్చే వారు ఎప్పుడూ స్వాగతార్హులే కాని దేశాన్ని అస్థిరం చేయాలనే ఉద్దేశంతో వచ్చే వారికి మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారతదేశం దానం చేసే ఆశ్రమం కాదు అని చెబుతూ, ప్రయోజనాల కోసం వచ్చిన వారిపై కచ్చితంగా పర్యవేక్షణ ఉండనుందని స్పష్టం చేశారు.
ఈ బిల్లుతో విదేశీయుల సమాచారం సమగ్రంగా కలిగి ఉండగలగడం, అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్యం, విద్య, వ్యాపార రంగాల్లో మెరుగైన అవకాశాలు అందించగలగడం, దేశ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇది 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మలచే ప్రయత్నంలో కీలక అడుగు కానుంది. రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడి వచ్చేవారి విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ తరహా అక్రమ ప్రవేశాలు దేశాన్ని అసురక్షితంగా మార్చుతున్నాయన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. బంగ్లాదేశ్ సరిహద్దులో 450 కిలోమీటర్ల ఫెన్సింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం భూమిని అందించకపోవడమేనని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 11 లేఖలు రాసినా, 7 సార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయిందని వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అక్రమంగా ఆధార్ కార్డులు జారీ అవుతున్నాయని, దాంతో చొరబాటు చేసే వారు దేశం మొత్తం వ్యాపించేందుకు మార్గం ఏర్పడుతోందన్నారు.
ఇక నకిలీ పాస్‌పోర్టు లేదా వీసాతో భారత్‌లోకి ప్రవేశించిన లేదా ఇక్కడ నుంచి బయటకు వెళ్లిన విదేశీయుడికి ఏడేళ్ల వరకు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే హోటళ్లు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు మొదలైన సంస్థలు తమ వద్ద ఉన్న విదేశీయుల సమాచారం తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వీసా గడువు మించిపోయిన విదేశీయులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న నాలుగు చట్టాలను.. 1920లో వచ్చిన పాస్‌పోర్ట్ చట్టం, 1939లో రూపొందిన విదేశీయుల నమోదు చట్టం, 1946లోని ఫారినర్స్ యాక్ట్, 2000లో వచ్చిన క్యారియర్స్ లయబిలిటీ చట్టాన్ని కొత్త బిల్లుతో రద్దు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది.