Punjab: అట్టడుకుతున్న చండీగఢ్ యూనివర్సిటీ
*వీడియోలు తీసిన విద్యార్థినిని అరెస్ట్ చేశామన్న పోలీసులు
Punjab: పంజాబ్ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీ అట్టుడికి పోతోంది. వేలాదిగా యూనివర్సిటీ విద్యార్థులు.. బయటకు వచ్చి నిరసన చేపట్టారు. యూనివర్సిటీ అధికారులు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అమ్మాయిల బాత్ రూమ్ వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని.. తన స్నేహితురాళ్ల ప్రైవేట్ వీడియోలను ఇతర వర్సిటీలో ఉన్న తన స్నేహితుడికి పంపడం.. అతడు ఆ వీడియోను ఇంటర్నెట్‌లో అప్ లోడ్ చేయడంపై.. విద్యార్థీ లోకం భగ్గుమంది. అయితే పోలీసులు మాత్రం.. విద్యార్థుల వెర్షన్‌ను తప్పుబడుతున్నారు. అసలు వీడియోలేవీ.. సోషల్ మీడియాలో వైరల్ కావడం లేదని.. స్పష్టం చేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలేనని.. ఒక విద్యార్థిని తన సొంత వీడియోను హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తితో షేర్ చేసుకున్నట్టు.. తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ అమ్మాయిని.. ఇప్పటికే అరెస్టు చేసినట్టు మొహాలీ పోలీసులు వెల్లడించారు. నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు.
అయితే అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్ కాగానే కొందరు ఆత్మహత్యాయాత్నం చేశారని.. అందులో ఒకరు మరణించినట్లు వస్తు్న్న వార్తలు కూడా పోలీసులు కొట్టిపారేస్తున్నారు. నిందితురాలు ఎవరికైతే వీడియో పంపిందో.. అతడిని కూడా అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందం సిమ్లాకు వెళ్లినట్టు ఏడీజీపీ గుర్‌ప్రీత్ కౌర్ దేవ్ వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన తమ దర్యాప్తులో నిందితురాలికి చెందిన ఒకే ఒక్క వీడియోను మాత్రమే గుర్తించినట్టు చెప్పారు. ఆమె ఇంకెవరి వీడియోలనూ రికార్డు చేయలేదని పోలీసులు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా.. పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. వాటిని పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. రూమర్లను సృష్టించవద్దని హెచ్చరించారు.
మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ పంజాబ్ డీజీపీ, చండీగఢ్ వర్సిటీ వీసీకి లేఖ రాశారు. అలాగే, ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని.. పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ప్రకటించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని.. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నట్లు ప్రకటించింది.