Kolkata Doctor Rape And Murder Case: కోల్‌కతా డాక్టర్ రేప్ కేసులో బ్లూటూత్ నిందితుడిని ఎలా పట్టించింది ?

Kolkata Doctor Rape And Murder Case: 31 ఏళ్ల మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి, ఆమెను బలిదీసుకున్న కామాంధుడిని పోలీసులకు పట్టిచ్చింది కూడా అలాంటి ఒక చిన్న క్లూనే అనే విషయం తెలిసిందే.

Update: 2024-08-19 11:52 GMT

Kolkata Doctor Rape And Murder Case

Kolkata Doctor Rape And Murder Case: కోల్‌కతాలో అక్కడి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యూయేట్ ట్రైని డాక్టర్ రేప్, మర్డర్ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు 6 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ తరహా ఘటనల్లో నిందితులను గుర్తించడం, అరెస్ట్ చేయడానికి రోజులకు రోజులు పట్టింది. ఇప్పటికీ చిక్కుముడులు వీడని కేసులు ఎన్నో ఉన్నాయి. సరైన ఆధారాలు లేకపోవడమే అందుకు కారణం అని ఆయా కేసులను దర్యాప్తు చేస్తోన్న పోలీసులు, దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో మాత్రం నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకోగలిగారు.

ఎంత పెద్ద నేరం చేసిన నిందితుడైనా, నేరస్తుడు ఎంత తెలివి గలవాడయినా.. తనకు తెలియకుండానే క్రైమ్ సీన్‌లో ఏదో ఓ క్లూ విడిచిపెట్టి వెళ్తుంటాడు. దర్యాప్తు సంస్థలు చురుగ్గా వ్యవహరిస్తే ఆ క్లూని వెతికి పట్టుకోవచ్చు.. అలాగే ఆ క్లూ ఆధారంగా నిందితుడిని కూడా వెతికి పట్టుకోవచ్చు. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులోనూ సరిగ్గా అదే జరిగింది.

31 ఏళ్ల మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి, ఆమెను బలిదీసుకున్న కామాంధుడిని పోలీసులకు పట్టిచ్చింది కూడా అలాంటి ఒక చిన్న క్లూనే అనే విషయం తెలిసిందే. ఔను, బాధితురాలి మృతదేహం లభించిన చోటుకు సమీపంలోనే పోలీసులకు ఓ బ్లూటూత్ లభించింది. ఆ బ్లూటూత్‌ని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తోన్న క్రమంలోనే పోలీసులకు మరో ఆధారం చిక్కింది. ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్ సెమినార్ హాలు పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలు పరిశీలించే క్రమంలో అదే బ్లూటూత్‌ని ధరించిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి వెళ్లడం ఆ దృశ్యాల్లో కనిపించింది. అతడే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోలీసు వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్‌గా పనిచేస్తోన్న సంజయ్ రాయ్.

సంజయ్ రాయ్ సెమినార్ హాలు పరిసరాల్లోకి ప్రవేశించేటప్పుడు అతడు ఆ బ్లూటూత్‌ని ధరించే ఉన్నాడు. ఆ తరువాత మరో 40 నిమిషాల వ్యవధిలో అతడు అక్కడి నుండి వెళ్లేటప్పటికి అతడి వద్ద ఆ బ్లూటూత్ కనిపించలేదు. సరిగ్గా అక్కడే పోలీసులకు అతడిపై అనుమానం బలపడింది. దీంతో సంజయ్ రాయ్‌ ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అప్పటితే అతడు ఆధారాలు మాయం చేసి, పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు తన దుస్తులను ఉతికి ఆరేసి నిద్రపోయాడు.

అయితే, అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ముందుగా తమకు లభించిన బ్లూటూత్ అతడి ఫోన్‌తో పెయిర్ అయి ఉందా లేదా అని పరిశీలించారు. ఆ బ్లూటూత్ అప్పటికే అతడి ఫోన్‌తో పెయిర్ అయి ఉండటంతో అతడికి ఈ ఘటనకు కచ్చితంగా సంబంధం ఉంది అనే నిర్ధారణకు వచ్చారు. ఈసారి ఇంకాస్తా గట్టిగానే తమదైన స్టయిల్లో ప్రశ్నించడంతో నిందితుడు వెంటనే తన నేరాన్ని అంగీకరించాడు. ఘటనాస్థలంలో లభించిన బ్లూటూత్ నిందితుడి ఆచూకీని పట్టించింది. అలాగే ఆ బ్లూటూత్ ఆధారంగా నిందితుడిని గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేసిన దృశ్యాలు సహాయపడ్డాయి.

ఇంతటితో అయిపోలేదు..

బ్లూటూత్ ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్ ని పోలీసులు పట్టుకున్నారు. అతడు కూడా తానే ఆ నేరం చేశానని.. ఉరి తీసుకుంటారేమో తీసుకోండి అని నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి. అయితే, ఈ కేసులో బాధితురాలి శవం లభించిన తీరు, ఆమె శరీరంపై ఉన్న గాయాలు అనేక అనుమానాలకు తావిచ్చాయి. అందుకు తగినట్టుగానే పోస్ట్ మార్టం నివేదిక సైతం ఇది ఒక్కరి పని కాకుండా అంతకంటే ఎక్కువ మంది ఈ దాడిలో పాల్గొని ఉండొచ్చనే సంకేతాలనిచ్చింది. దీంతో డాక్టర్ పై దాడికి పాల్పడిన నిందితులను అందరినీ అరెస్ట్ చేయకుండా కేవలం సంజయ్ రాయ్ అరెస్ట్ చేసి బెంగాల్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వంలోని పెద్దలతో ఈ కేసుకు లింకు ?

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కేబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రుల పుత్రరత్నాలకు ఈ కేసుతో నేరుగా సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వారిని రక్షించే ప్రయత్నంలో భాగంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కేసు విచారణను తప్పుదోవ పట్టిస్తోంది అని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో అసలు వాస్తవాలు బయటికొస్తే.. అవి ముందుగా మమతా బెమర్జి ప్రభుత్వానికే భారీ నష్టం కలిగించే ప్రమాదం ఉందనేది ఆందోళనకారుల వాదన.

సీబీఐ ఎంట్రీ

కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో మమతా బెనర్జీ సర్కారు పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలతో ఈ కేసు విచారణ సీబీఐ చేతికి వెళ్లింది. రంగంలోకి దిగి విచారణ చేపట్టిన సీబీఐ.. ఈ దురాగతం జరిగిన తీరుతెన్నులను, ఆ తరువాత జరిగిన పరిణామాలను క్రోడీకరించుకుని ఒక్కొక్కరిని ప్రశ్నించడం మొదలుపెట్టింది. 

ఆధారాలు మాయం చేసే కుట్ర

అయితే, సీబీఐ రాకకంటే ముందుగానే హాస్పిటల్‌పై ఒక పెద్ద దాడి జరిగింది. ఈ దాడిలో హాస్పిటల్ విధ్వంసానికి గురైంది. ఈ దాడి వెనుక నిందితులను కాపాడే కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి పేరుతో ఘటనా స్థలంలో ఆనవాళ్లను చెరిపేసి సీబీఐ చేతికి ఏమీ చిక్కకుండా చేయడమే అసలు కుట్రగా అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు.. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం వల్ల వారిని భయబ్రాంతులకు గురిచేయొచ్చనే కుట్ర కోణం కూడా ఇందులో దాగి ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దాడి అనంతరం దాడికి బాధ్యులుగా భావిస్తున్న 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అది వేరే విషయం.

ఇదిలావుండగానే కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సుప్రీం కోర్టు సైతం ఈ కేసుని సుమోటోగా స్వీకరిస్తున్నట్టుగా స్పష్టంచేసింది. ఆగస్టు 20వ తేదీన ఈ కేసుపై విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు తమ ప్రకటనలో పేర్కొంది. దీంతో రేపు సుప్రీం కోర్టు ఈ కేసుపై ఎలా స్పందిస్తుంది ? ఎలాంటి ఆదేశాలు జారీచేస్తుంది ? కేసు విచారణలో వేగం పుంజుకుంటుందా ? అసలు దోషులు బయటికొస్తారా ? సర్వోన్నత న్యాయస్థానం ఎంట్రీతోనైనా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందా ? ఇలా అనేక ప్రశ్నలు ఈ కేసుని నిశితంగా పరిశీలిస్తున్న వారి మదిలో మెదులుతున్నాయి. ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే మరి.

Tags:    

Similar News