భారతదేశంలో పిల్లలకు టీకాలు వేయడం మానేశారా? డబ్ల్యుహెచ్ఓ రిపోర్ట్ ఏం చెబుతోంది?
జీరో డోస్.. అంటే టీకాల డోసు ఒక్కటి కూడా తీసుకోని పిల్లలు అన్నమాట. ఇలాంటి పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న పది దేశాల్లో భారత్ ఒకటి కావడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
భారతదేశంలో 2023లో 16 లక్షల మంది పిల్లలకు డీపీటీతో పాటు మీజిల్స్ టీకాలు వేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. పిల్లల వ్యాక్సినేషన్ వైఫల్యంలో ప్రపంచంలో నైజీరియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, భారత్ రెండో స్థానంలో ఉందన్నది నమ్మలేని నిజం. ఈ యూఎన్ఓ నివేదిక సోమవారం నాడు విడుదలైంది. డిప్తిరియా, ఫెర్టుసిస్, టెటనస్ రాకుండా డీపీటీ వ్యాక్సిన్ చిన్న పిల్లలకు ఇస్తారు. అదే విధంగా తట్టు లేదా పొంగు సోకకుండా మీజిల్స్ వ్యాక్సిన్ అందిస్తారు.
ఇండియాలో పెరుగుతున్న జీరో డోస్ పిల్లల సంఖ్య
జీరో డోస్.. అంటే టీకాల డోసు ఒక్కటి కూడా తీసుకోని పిల్లలు అన్నమాట. ఇలాంటి పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న పది దేశాల్లో భారత్ ఒకటి కావడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. కరోనా వ్యాక్సీన్ డోసులను కోట్ల సంఖ్యలో తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేశామని చెప్పుకునే దేశంలో పరిస్థితి ఇలా ఎందుకుందనే ప్రశ్న వినిపిస్తోంది.
అంతేకాదు, ఇలాంటి పిల్లల సంఖ్య భారత్‌లో ప్రతి ఏటా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. 2022లో 11 లక్షల మంది చిన్నారులు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోలేదు. 2023 నాటికి ఈ సంఖ్య 16 లక్షలకు పెరిగింది. అంటే, భారత్‌లో జీరో డోస్ పిల్లల సంఖ్య 2022తో పోలిస్తే 2023 నాటికి 45 శాతం పెరిగింది. వ్యాక్సినేషన్ లేకపోవడంతో లక్షలాది మంది చిన్నారులు వ్యాధుల బారినపడుతున్నారు. భవిష్యత్తులో రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిన స్థితిలో ఉన్నారు.
నైజీరియా నంబర్ వన్... సెకండ్ ప్లేస్‌లో ఇండియా
వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులున్న దేశాల్లో 21 లక్షలతో నైజీరియా అగ్రస్థానంలో నిలిచింది. 16 లక్షల జీరో డోస్ కేసులతో ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. 9.17 లక్షలతో ఇథోపియో మూడో స్థానంలో, 8.39 లక్షలతో కాంగో నాలుగో స్థానంలో, 7 లక్షలతో సూడాన్ ఐదో స్థానంలో నిలిచింది. 4.11 లక్షలతో అంగోలా తొమ్మిది స్థానంలో ఉండగా, 3.96 లక్షలతో పాకిస్తాన్ పదో స్థానంలో నిలిచింది. అంటే, ఈ విషయంలో భారత్ కన్నా పాకిస్తాన్ చాలా మెరుగైన స్థితిలో ఉంది.
టీకా తీసుకోని ప్రతి నలుగురిలో ముగ్గురికి మీజిల్స్ తప్పదు
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం అన్ని దేశాల్లో కలిపి 84 శాతం మంది చిన్నారులు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే, ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోని పిల్లల సంఖ్య 2022లో ఒక కోటి 39 లక్షల నుంచి 2023 నాటికి కోటి 45 లక్షలకు పెరిగింది.
31 దేశాల్లోని చిన్నారులు అసలు ఏ టీకా వేసుకోలేదని ఈ నివేదిక వెల్లడించింది. టీకాలు తీసుకోని ప్రతి నలుగురిలో ఒక్కరికి మీజిల్స్ వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 6.5 మిలియన్ల చిన్నారులు డీపీటీ మూడో డోస్ పూర్తి చేయలేదు.
ఇదిలా ఉంటే మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకోని పిల్లల సంఖ్య 3.5 కోట్లుగా ఉంది. 2023లో 83 శాతం మంది పిల్లలు మీజిల్స్ మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోస్ పొందిన పిల్లల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగి 74 శాతానికి చేరుకుంది. ప్రపంచంలోని 103 దేశాల్లో గత ఐదేళ్లలో మీజీల్స్ మళ్లీ వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
భారత్‌లో పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్ కేసులు
ఇండియాలో 1.2 లక్షల మందికి పైగా మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో 77 వేల మంది మరణిస్తున్నారని హెచ్ పీ వీ ఇన్ఫర్మేషన్ సెంటర్ నివేదిక తెలిపింది.
మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్బాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. 15 నుంచి 44 ఏళ్ల వయస్సు గల మహిళల్లో ఈ క్యాన్సర్ వ్యాప్తి చెందుతోంది. అయితే, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇచ్చే వ్యాక్సిన్ ను నిలిపి వేసిన 52 దేశాల్లో ఇండియా కూడా ఉంది.Vaccination In India, India Vaccination, Vaccinations, Coronavirus In India, Children Vaccinations, World Health Organization, UNICEF, United Nations International Childrens Emergency Fund, DPT vaccine, Measles vaccine,
గర్భాశయ క్యాన్సర్ ను నివారించడంలో హెచ్ పీ వీ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2022తో పోలిస్తే 2023 నాటికి హెచ్ పీ వీ వ్యాక్సిన్ తీసుకున్న బాలికల సంఖ్య 20 నుండి 27 శాతానికి పెరిగింది. మరో వైపు యునిసెఫ్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 4 లక్షల మందిలో నిర్వహించిన సర్వేలో 75 శాతం మందికి హెచ్ పీ వీ వ్యాక్సిన్ గురించి తెలియదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.
ఇలాంటి పరిణామాలతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదోనమ్ అన్నారు. ప్రపంచ దేశాలు ఇమ్యునైజేషన్ ఎజెండా లక్ష్యాలను విస్మరించకూడదని ఆయన సూచించారు.