Delhi Farmers: ట్రాక్టర్ పరేడ్ విధ్వంసం తర్వాత వెనక్కి తగ్గని అన్నదాతలు
ట్రాక్టర్ పరేడ్‌లో విధ్వంసం తర్వాత కొంత వెనక్కు తగ్గినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ ఉధృతం అవుతోంది. ఇప్పటివరకు పంజాబ్, హరియాణా రైతులే ఉద్యమంలో కీలక పాత్ర పోషించగా ఇప్పుడు పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రైతులు కూడా వీరికి జత కలిశారు. దీంతో ఢిల్లీ-మీరట్ రహదారిపై ఉన్న ఘాజీపూర్ మరో ప్రధాన కార్యక్షేత్రంగా మారిపోయింది.
ఘాజీపూర్‌లోని శిబిరం దగ్గరకు రైతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో అన్నదాతల ఆందోళన నానాటికీ బలం పుంజుకుంటోంది. అటు ఫిబ్రవరి 2వ తేదీ వరకు భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకుంటారని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. దీంతో రైతుల నిరసన కేంద్రాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
మరోవైపు కేంద్ర తీరును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన అన్నదాతలు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నూతన చట్టాల రద్దు వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మళ్లీ చర్చల కోసం ప్రభుత్వం పిలిస్తే తప్పకుండా వెళ్తామంటున్న రైతు సంఘాల నాయకులు తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందన్నారు.
ఇదిలా ఉంటే మరోసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా నిరసన కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈరోజు రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.