Haryana Elections 2024: బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? లేక రైతు ఉద్యమాల పవర్‌తో కాంగ్రెస్‌ మళ్ళీ జెండా ఎగరేస్తుందా?

Update: 2024-09-16 15:15 GMT

Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది అక్టోబర్ 05న ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ ప్రయత్నించినా హర్యానాలో కాంగ్రెస్ నాయకత్వం ఈ పొత్తును వ్యతిరేకించింది. దీంతో పొత్తు కుదరలేదు. జననాయక్ జనతా పార్టీ జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ , బహుజన్ సమాజ్ పార్టీ, హర్యానా లోఖిత్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ దఫా అధికారం చేపడితే హర్యానాలో మూడోసారి అధికారాన్ని దక్కించుకొని బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుంది. 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి సీఎం పీఠాన్ని దక్కించుకోనేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.

హర్యానాలో మూడు కుటుంబాలదే ఆధిపత్యం

హర్యానా రాష్ట్రం 1966లో ఏర్పడింది. అప్పటి నుంచి దేవీలాల్, భజన్ లాల్, బన్సీలాల్ కుటుంబాల చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ ముగ్గురూ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా కొనసాగినవారే. దేవీలాల్ 1989 డిసెంబర్ 2 నుంచి 1991 జూన్ 2 వరకు ఉపప్రధానిగా కూడా సేవలందించారు. ఈ ముగ్గురి వారసులు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

దేవీలాల్ మనవడు ఆదిత్య దేవీలాల్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ తరపున దబ్వాలీ నుంచి బరిలోకి దిగారు. మరో మనవడు దిగ్విజయ్ సింగ్ చౌటాలా జననాయక్ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. రాణియాలో దేవీలాల్ కొడుకు రంజిత్ సింగ్ ఇండిపెండెంట్ గా పోటీకి దిగారు. ఆయనకు బీజేపీ టిక్కెట్టు ఇవ్వలేదు. ఇక్కడ ఐఎన్ఎల్ డీ తరపున దేవీలాల్ ముని మనవడు అర్జున్ చౌటాలా పోటీకి దిగారు. ఇక ఆదంపుర్ లో భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. తోషంలో బన్సీలాల్ వారసులు అనిరుధ్ చౌధరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. శ్రుతి చౌధరి బీజేపీ అభ్యర్ధిగా పోటీకి దిగారు.

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించేనా?

హర్యానాలో 2014 నుంచి రెండుసార్లు బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. హర్యానాలో పార్టీని గట్టెక్కించేందుకు బీజేపీ అగ్రనాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలోని 10 ఎంపీ సీట్లు దక్కాయి. కానీ, 2024 ఎన్నికల్లో బీజేపీ 5 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీని ఆలోచనలో పడేశాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని నింపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. పదేళ్లలో బీజేపీ వైఫల్యాలను అస్త్రాలుగా ఆ పార్టీ ప్రచారం చేస్తోంది.

అందరి దృష్టి ఈ సీట్లపైనే

నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే రెజ్లర్ వినేష్ పోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు జింద్ ప్రాంతంలోని జులానా అసెంబ్లీ స్థానాన్ని హస్తం పార్టీ కేటాయించింది. ఈ స్థానంలో పోగట్ పై బబితా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతుందని తొలుత ప్రచారం సాగింది. కానీ, బీజేవైఎం ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షులు కెప్టెన్ యోగేష్ బైరాగిని ఆ పార్టీ బరిలోకి దింపింది. డబ్ల్యుడబ్ల్యూఈలో భారతదేశపు తొలి మహిళా ప్రొఫెషనల్ రెజ్లర్ కవిత దలాల్ ను ఆప్ తన అభ్యర్ధిగా ఇక్కడ రంగంలోకి దించింది.

ఉచానా కలాన్ అసెంబ్లీ స్థానంలో జననాయక్ జనతా పార్టీ జేజేపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. బీజేపీ అభ్యర్ధి ప్రేమ్ లతపై ఆయన నెగ్గారు. ఇటీవలే బీజేపీని వీడిన మాజీ ఐఎఎస్ అధికారి బ్రిజేంద్రసింగ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. స్థానికంగా బలమైన సంబంధాలున్నా దేవేందర్ అత్రిని బీజేపీ పోటీకి దింపింది. ఇక్కడ మూడింట ఒక వంతు జాటు ఓటర్లుంటారు. ఆయా పార్టీల గెలుపు ఓటములను వారే నిర్ణయిస్తారు.

గర్హి సంప్లా కిల్హోయ్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ కు కంచుకోటగా చెబుతారు. మాజీ సీఎంహుడా కుటుంబానికి ఈ ప్రాంతంలో మంచి పట్టుంది. రోహ్ తక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న మంజు హుడాను బీజేపీ బరిలోకి దింపింది. ఆమె భర్త రాజేష్ హుడా రోహ్ తక్ బలమైన వ్యక్తి. ఆమె తండ్రి ప్రదీప్ యాదవ్ హర్యానా పోలీస్ డిప్యూటీ సూపరింటెండ్. ప్రవీణ్ గుస్తానీని ఆప్ తన అభ్యర్ధిగా నిలిపింది. ఈ నియోజవకర్గంలోని ఓటర్లలో 25 శాతం మంది జాట్లు ఉంటారు.

లాడ్వా లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన మేవాసింగ్ పై నయాబ్ సింగ్ ను బీజేపీ బరిలోకి దింపింది. రైతుల ఉద్యమంతో ప్రభావితమైన ఉత్తర హర్యానా జిల్లాలో ఈ సీటుంది. ఓబీసీల జనాభా ఈ నియోజకవర్గంలో 40 శాతంగా ఉంటుంది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడింది.అయితే ఇప్పటివరకు ఏ పార్టీ కూడా రెండుసార్లు గెలువలేదు.

ఎలెనాబాద్ లో ఐఎన్ఎల్ డీ సీనియర్ నాయకులు అభయ్ సింగ్ చౌతాలా మళ్లీ పోటీ చేస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రదర్శన పేలవంగా ఉంది. బహుజన సమాజ్ పార్టీతో ఐఎన్ఎల్ డీ పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా ఐఎన్ఎల్ డీ 37 స్థానాల్లో బీఎస్పీకి కేటాయించింది. ఈ కూటమి జాట్, షెడ్యూల్డ్ కులాల ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ అమీర్ చందాను బీజేపీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ భరత్ సింగ్ బెనివాల్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. మనీష్ ఆరోరా ఆప్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు.

కైతాల్ లో కాంగ్రెస్ ప్రముఖ నాయకులు రణదీప్ సూర్జేవాలా కొడుకు ఆదిత్య సూర్జేవాలాను బరిలోకి దింపింది. ఆదిత్య తండ్రి సూర్జేవాలా ఇదే స్థానం నుండి రెండుసార్లు గెలిచారు. 2019లో బీజేపీ అభ్యర్ధి లీలారామ్ కైతాల్ రణదీప్ సింగ్ సూర్జేవాలాపై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు.

రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండా

హర్యానాలో ప్రధానంగా రైతాంగ సమస్యలను ప్రధాన పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. హర్యానాకు చెందిన రైతులు ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. రైతుల సమస్యలను కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కూడా ప్రస్తావిస్తున్నాయి. నిరుద్యోగం పెరుగుదల అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రచారంగా మార్చుకుంటుంది. దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రం హర్యానా అంటూ కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది. రైతు ఉద్యమాలు తమకు కలిసివస్తాయని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంది.

అయితే ఈ 10 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసిన ఓట్లేయాలని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. మూడోసారి అధికారం దక్కించుకోవాలని కమలదళం కదనరంగంలోకి దిగింది. హర్యానా ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో అక్టోబర్ 8న తేలనుంది.

Tags:    

Similar News