Top 6 News @ 6PM: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్
1) చత్తీస్‌ఘడ్ అడవుల్లో మరోసారి ఎన్‌కౌంటర్
చత్తీస్‌ఘడ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. కూంబింగ్ ఆపరేషన్ మీదున్న భద్రతా బలగాలకు నక్సలైట్లు తారసపడ్డారు. దీంతో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లోనే నలుగురు నక్సలైట్స్ చనిపోయారు. చనిపోయిన వారిలో ఒక డివిజినల్ కమిటీ మెంబర్ స్థాయి (DVC rank naxalite) కూడా ఉన్నారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రత బలగాల వైపు నుండి మూడు జిల్లాలకు డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ బలగాలు పాల్గొన్నాయి. వీరితో పాటు సీఆర్పీఎఫ్‌లో జంగిల్ వార్ ఫేర్ యూనిట్స్‌గా పేరున్న 5 కోబ్రా బలగాలు (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్), సీఆర్పీఎఫ్‌కు చెందిన 229 బెటాలియన్ బలగాలు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ లో ఉండగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
2) Saif Ali Khan Health Bulletin: వెన్నెముక నుంచి కత్తి మొన తీసిన డాక్టర్లు..!
Saif Ali Khan Health Bulletin: బాలీవుడ్ హిరో సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నంతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల ప్రాంతంలో సైఫ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సైఫ్ కుమారుడి రూంలోకి వెళ్లిన ఆగంతకులను గమనించిన పనిమనుషులు గట్టిగా అరవడంతో... దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశాడు సైఫ్ అలీఖాన్. దీంతో తమ వెంట తెచ్చుకున్న కత్తులతో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసి గాయపరిచారు. వెంటనే అతడిని ఆటోలో లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వెన్నుముకతో పాటు మెడ, ఎడమచేతిపై గాయాలు అయినట్లు వైద్యులు వెల్లడించారు. వెన్నుముకలో రెండున్నర ఇంచులు మేర కత్తి ఉండిపోయిందని... దానిని సర్జరీ చేసి తొలగించామన్నారు. మెడకు ప్లాస్టిక్ సర్జరీ చేశామన్నారు. సర్జరీ అనంతరం ఐసీయూకి తరలించి అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. కోలుకున్న వెంటనే డిశ్చార్జీ చేస్తామని వెల్లడించారు.
3) BRS: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్
BRS: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కు వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది గులాబీ పార్టీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు దాటినా ఇప్పటికీ స్పీకర్ చర్యలు తీసుకోలేదని ఆ పిటిషన్ లో బీఆర్ఎస్ కోరింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని ఆ పిటిషన్ లో కోరింది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో పార్టీ నిర్ణయం చెప్పాలని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది.మేఘాచంద్ర కేసు తీర్పునకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోనేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ కోరింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) Daku Maharaj Collections: 100 కోట్ల క్లబ్‌లోకి డాకు మహారాజ్.. బాలయ్య ఖాతాలో మరో రికార్డు..!
Daku Maharaj Collections: నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.105 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్ మెంట్ వెల్లడించింది. కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. డాకు మహారాజ్‌కు మొదటి రోజు అంటే జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
సితారా ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో అంచనాలు పెంచుకున్నారు. అయితే అభిమానులు ఆశించినట్టే.. ఈ సినిమా తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఓ వైపు వరస సక్సెస్‌లు.. అటు అన్ స్టాపబుల్ షోతో కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్నారు. హీరోగా వరుస సక్సెస్‌లు.. హోస్ట్‌గా డబుల్ సక్సెస్ అందుకున్నారు. మరోవైపు పొలిటికల్‌గానూ రాణిస్తున్నారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ మూవీతో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్బులో ప్రవేశాంచారు బాలకృష్ణ.. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హాట్రిక్ సక్సెస్ బాలయ్య ఖాతాలో నమోదయింది. ఇప్పుడు డాకు మహారాజ్‌తో మరోసారి రికార్డ్ క్రియేట్ చేశారు బాలకృష్ణ.
5) Bank Account: అలా చేస్తే మీ బ్యాంకు ఖాతా రద్దు అవుతుంది తెలుసా?
Bank Account: ఒకరికి ఎన్ని బ్యాంకు ఖాతాలుండాలి? దీని వల్ల ఏమైనా ఇబ్బందా? లావాదేవీలు చేయని ఖాతాలపై బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.
కొందరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాలు మారిన సమయాల్లో కొత్తగా బ్యాంకు ఖాతాలను తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఒకటి కంటే ఎక్కువగా బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అయితే బ్యాంకు ఖాతాలను ఉపయోగించరు. రెండు లేదా మూడు బ్యాంకు ఖాతాలను రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తుంటారు. అయితే ఖాతాను ప్రారంభించి అసలు సరైన నగదు నిల్వ లేకపోతే ఆ ఖాతాలు ఏం చేస్తారు? ఈ ఖాతాలు ఓపెన్ చేసిన ఖాతాదారుడికి ఫైన్ విధిస్తారా? ఖాతాలు రద్దు చేస్తారా? ఆర్ బీ ఐ నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Israel Hamas War: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.. బందీలు విడుదల?
Israel Hamas War: గాజాలో శాంతిస్థాపన కోసం ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. వచ్చే ఆరు వారాల పాటు యుద్ధం ఉండదు. దీంతో బందీలను కూడా విడుదల చేయనున్నారు.
పశ్చిమాసియాలో కీలక పరిణామం నెలకొంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి.