సైఫ్ అలీ ఖాన్‌పై ఎటాక్ చేసిన వ్యక్తి ఇతనే

Update: 2025-01-16 16:44 GMT

Attack on Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తాజాగా నిందితుడి ఫోటోను విడుదల చేశారు. సైఫ్‌పై దాడి చేసి మెట్లు దిగి పారిపోతుండగా ఆ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల్లోని వ్యక్తి కోసం ప్రస్తుతం ముంబై పోలీసులు గాలిస్తున్నారు.

ఇక సైఫ్ హెల్త్ అప్‌డేట్ విషయానికొస్తే... ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ నీరజ్ ఉత్తమణి ఆ వివరాలు మీడియాకు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతానికి ఔట్ ఆఫ్ డేంజర్ అని అన్నారు. కత్తిపోట్ల కారణంగా అయిన వెన్ను గాయంలోంచి 2 అంగుళాల కత్తి ముక్కను బయటికి తీసినట్లు చెప్పారు. సైఫ్‌పై దాడి ఘటన బాలీవుడ్ తో పాటు వ్యాపార, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సైఫ్ పై దాడి చేసిన దుండగుడు అప్పటికప్పుడు బయటి నుండి ఇంట్లోకి చొరబడలేదని తేలింది. సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరీక్షించగా...అర్థరాత్రి తరువాత ఇంట్లోకి ఎవ్వరూ వచ్చిన దాఖలాలు కనిపించలేదని ముంబై పోలీసులు చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి రాత్రి పొద్దుపోక ముందే ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోనే ఎవ్వరికీ కనిపించకుండా దాక్కుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంట్లో ఎవ్వరూ పసిగట్టలేకపోయారంటే... ఇంట్లోనే పనిచేసే వారు ఆ వ్యక్తికి సహాయం చేసి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇదంతా ఇలా ఉంటే, మరోవైపు సైఫ్‌పై దాడి ఘటన రాజకీయంగా అధికార పక్షానికి, విపక్షానికి మధ్య విమర్శలకు తావిచ్చింది. ముంబైలో సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. విపక్షం విమర్శలపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్... సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన దురదృష్టకరం అన్నారు. అయితే, ఆ ఘటనను రాజకీయంగా వాడుకోవాలనుకోవడం సరికాదని ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు.  

Tags:    

Similar News