Train Collision: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్‌ రైలును ఢీకొన్న కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్‌ రైలును కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్ ఢీకొంది.

Update: 2024-06-17 05:17 GMT

Train Collision: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్‌ రైలును ఢీకొన్న కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్

West Bengal: పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లా రంగపాణి సమీపంలో ఓ గూడ్స్ రైలు కాంచనజంగ ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో కాంచనజంగ రైలు వెనుక భాగంలోని మూడు బోగీలు డ్యామేజ్ అయ్యాయి. అందులో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. 30 మంది గాయాల పాలవగా.. అందులో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెనుక భాగం నుంచి రైలును ఢీకొట్టడంతో గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ రైల్లోనే ఇరుక్కునిపోయారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలకు రంగంలోకి దిగాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు NDRF, SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 15 అంబులెన్స్‌లతో పాటు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు అధికారులు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ వేగవంతం చేయాలని సూచించారు. ప్రమాదంతో ఈ మార్గం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. కొన్నింటిని దారి మళ్లించారు. ఘటనా స్థలంలో బోగీలు చెల్లా చెదురుగాపడి ఉన్నాయి. దీంతో బోగీలను పక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్‌ న్యూ జల్‌పాయ్‌గురి జంక్షన్‌లో ఆగింది. అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో వెనుక నుంచి గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. రెండు రైళ్లు ఢీ కొనడంతో కాంచన్‌జంగ రైలులోని ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లోని రెండు బోగీలు పట్టాలు తప్పగా.. గూడ్స్‌లోని పలు బోగీలు చెల్లాచెదురయ్యాయి. అయితే ఈ ప్రమాదం వెనుక లోకో పైలట్ తప్పిదం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. గూడ్స్‌ ట్రైన్‌కు రెడ్ సిగ్నల్ వేసినా.. పట్టించుకోకుండా వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇక రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగాల్ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, సీఎం మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి చేరుకోగా.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కూడా డార్జిలింగ్‌కు బయలుదేరారు.

ఇక రైలు ప్రమాదంతో చిక్కుకున్న వారిని వారి ప్రాంతాలకు వెళ్లేలా బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నార్త్ బెంగాల్ రాష్ట్రీయ పరివాహన్ నిగమ్ నుంచి పది ప్రత్యేక బస్సులను ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపుతున్నారు. కోల్‌కతాలోని సిలిగురి నుంచి కూడా మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల వివరాలు, వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు రెండు టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. 

Tags:    

Similar News