Bengaluru Rains: వరద నీటిలో రూ.2 కోట్ల బంగారం..
Bengaluru Rains: బెంగళూరులో మండుటెండల్లో వరదలు వణికించాయి.
Bengaluru Rains: బెంగళూరులో మండుటెండల్లో వరదలు వణికించాయి. ఆకస్మిక వర్షాలతో నగరం చిగురుటాకులా వణికింది. భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపించాయి. కుండపోత వర్షానికి డ్రైన్లు పొంగిపొర్లడంతో పలు చోట్ల జనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అండర్ పాస్ లో వరద నీరు చేరి కార్లు కొట్టుకుపోతే..సబ్ వేలు సైతం నీట మునిగాయి. బెంగళూరు సిటీతో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం కూడా అయ్యాయి. ఈ వరదల్లో రెండు కోట్ల రూపాయల విలువ చేసే బంగారం కూడా కొట్టుకుపోయింది.
బెంగళూరులోని మల్లేశ్వర్ ప్రాంతంలో ఒక నగల దుకాణం ఉంది. ఈ దుకాణంలోకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. అక్కడి సిబ్బంది షటర్లు మూసేలోపే వరద నీరు షాపులోకి చేరి బంగారు నగలను తుడిచి పెట్టుకుపోయింది. వరదనీటిలో 80 శాతం బంగారం కొట్టుకుపోయిందని ఆ షాపు యజమాని లబోదిబోమంటున్నాడు. భారీ వర్షాల కారణంగా షాపులో ఉన్న రూ.2 కోట్ల విలువైన బంగారం నీటిలో కొట్టుకుపోయిందని వాపోతున్నాడు.