లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేస్తే కోటి నజరానా: పోలీసులకు కర్ణిసేన ఆఫర్

రెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు కోటి రూపాయాలను నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణిసేన రివార్డ్ ప్రకటించింది.

Update: 2024-10-22 09:15 GMT

లారెన్స్ బిష్ణోయ్ ని ఎన్ కౌంటర్ చేస్తే కోటి నజరానా:పోలీసులకు కర్ణిసేన ఆఫర్

లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు కోటి రూపాయాలను నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణిసేన రివార్డ్ ప్రకటించింది. ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు రాజ్ షెకావత్ ఓ వీడియోను విడుదల చేశారు. బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు 1 కోటి 11 లక్షలు బహుమానంగా ఇస్తామని ఆయన ఆ వీడియోలో చెప్పారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పలు రాష్ట్రాల్లో ఎన్ని హత్యలకు పాల్పడినా కేంద్ర ప్రభుత్వం కానీ, గుజరాత్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తమ అధినేత సుఖ్ దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదని షెకావత్ ఆ వీడియోలో చెప్పారు.

కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని 2023, డిసెంబర్ 5న జైపూర్‌లోని ఆయన ఇంట్లోనే దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యకు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గోదారా ఈ హత్య తమ పనేనని అప్పట్లో ప్రకటించారు. రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను 2023, డిసెంబర్ 9న చండీగడ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. సుఖ్‌దేవ్‌ను హత్య చేయాలని గోదారా తమను ఆదేశించారని అరెస్టైన నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.

సుఖ్‌దేవ్ సింగ్‌ను ఎందుకు హత్య చేశారు?

గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ సింగ్ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నిరసనలను విరమించుకున్నందుకు ఆయనను హత్య చేశారు. ఆనంద్ పాల్ సింగ్ కోసం సేకరించిన నిధులను కూడా సుఖ్‌దేవ్ సింగ్ తన వద్దే ఉంచుకున్నారని కూడా నిందితులు అప్పట్లో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు బదులు తీర్చుకోవాలని కర్ణిసేన ప్లాన్

సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని కర్ణిసేన భావిస్తోందని షెకావత్ వీడియోను బట్టి తెలుస్తోంది. సుఖ్‌దేవ్ సింగ్ హత్య జరిగి సుమారు 9 నెలలు దాటింది. ఈ తరుణంలో షెకావత్ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. జైల్లోనే ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఆయన ఆరోపణలు చేశారు. 

గుజరాత్ సబర్మతి జైల్లోనే ఉన్న గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి, ఎన్ సీ పీ నాయకులు బాబా సిద్దిఖీ హత్యతో మరోసారి లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి చర్చకు వచ్చింది.

Tags:    

Similar News