Monkey and Snake viral video: పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తుంటే.. ఎందుకలా కోతి పనులు చేస్తున్నారని అంటుంటారు. నిజంగానే కోతులు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. సర్కస్ ఫీట్స్ చేస్తూ, తింగర పనులు చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ కోతి చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి ఏకంగా పాముతోనే చెలగాటమాడింది. దాని మానాన అది వెళ్లకుండా పాము తోకను పట్టుకొని లాగింది. దీంతో చివరికి ఆ కోతికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. ఓ కోతి కొబ్బరి చెట్టు ఎక్కింది. అదే సమయంలో ఆ కొబ్బరి చెట్టుకు ఉన్న తొర్రలో నుంచి పాము బయటకు వచ్చింది. కొంత భాగం చెట్టు తొర్రలో ఉండగా మరికొంత భాగం బయటకు ఉంది. అయితే పామును చూసిన వెంటనే కోతి తొర్రలోకి దూరి మరీ ఆ పామును చేత్తో పట్టుకుంది. అయితే ఆ పాము ఊరికే ఉంటుందా.? ఒక్కసారిగా బుసలు కొడుతూ కోతిపైకి దాడి చేసింది.
అంతటితో ఆగకుండా కోతి తలను గట్టిగా కరిచి పట్టుకుంది. విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా పాము మాత్రం వదల్లేదు. నొప్పితో విపరీతంగా బాధపడ్డ కోతి తనలోని శక్తినంతా కూడదీసుకుని పాము బారి నుండి తనను తాను విడిపించుకుంది. చివరికి ఎలాగోలా పాము నుంచి బయటపడింది.
ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోతి పనులు అంటే ఇవేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు కామెంట్ చేస్తూ పాము విషపూరితమైంది కాదేమో అంటున్నారు. ఇంకొంతమంది ఒకవేళ ఆ పాము విషపూరితమైనది అయితే, ఆ పాము కాటుకు గురైన కోతి పరిస్థితి ఎలా ఉందో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.