ఆత్మహత్య చేసుకునే రైతులే పిరికివాళ్ళు : కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు దేశ రాజధానిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు దేశ రాజధానిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని పొన్నంపేటలో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. "ఆత్మహత్య చేసుకున్న రైతులు పిరికివారు. భార్య మరియు పిల్లలను చూసుకోలేని పిరికివాడు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటాడు. మనం పడిపోయినప్పుడు (నీటిలో) మనం ఈత కొట్టాలి, గెలవాలి అని అన్నారు. వ్యవసాయం ఎంతో లాభసాటిదని, ఆ విషయం తెలియక పిరికివాళ్ళు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
ఈ సందర్బంగా మంత్రి ఓ ఉదాహరణ కూడా చెప్పారు. 'చేతుల నిండా బంగారు గాజులు ధరించిన ఓ మహిళను.. ఆమెకు అవి ఎలా వచ్చాయని నేను ఆరా తీశాను. ఆమె ఏం చెప్పిందో తెలుసా? తల్లి లాంటి ఈ భూమి నా 35ఏళ్ల కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చిందని చెప్పింది. వ్యవసాయం మీద ఆధారపడ్డ ఓ మహిళ ఇంత సాధించగలిగితే, మిగతా రైతులు మాత్రం ఎందుకని వెనుకబడిపోతున్నారని పాటిల్ ఈ సందర్బంగా ప్రశ్నించారు.
అయితే రైతుల పట్ల అయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతమైన పదవిలో ఉండి మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రైతులను అవమానించడమేనని, ఇది రైతులకు అగౌరవమని, దీనికి మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ కర్ణాటక యూనిట్ ప్రతినిధి వి.ఎస్.ఉగ్రప్ప డిమాండ్ చేశారు.