ఢిల్లీలో ముగిసిన రైతుల ఆందోళనలు..సింఘు బోర్డర్ నుంచి స్వస్థలాలకు రైతులు
* సింఘు సరిహద్దుల్లో టెంట్లను ఖాళీ చేసిన రైతులు * 3 చట్టాలు రద్దు ప్రక్రియ పూర్తికావడంతో ఆందోళనలు విరమణ
Delhi: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా పోరాటం చేసిన అన్నదాతలు ఆందోళనలు విరమించి ఇంటి బాట పట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలకు మోదీ సర్కార్ దిగిరావడం, ఆ చట్టాలను రద్దు చేయడంతో రైతులు తమ నిరసనను ముగించి ఇళ్లకు బయలుదేరారు. ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా గురువారం నాడే ప్రకటన చేసింది. దీంతో వేలాది మంది రైతులు ఇంటిబాట పట్టారు. ఇన్నాళ్లూ తాము బైఠాయించిన ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులు భారీ ర్యాలీలు, మార్చ్ లతో సొంత ఊళ్లకు బయలుదేరారు.
ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు కిసాన్ మోర్ఛా గురువారం ప్రకటన చేయడంతో ఢిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రి, ఘాజీపూర్ ప్రాంతాలనుంచి శిబిరాలను ఎత్తేసే ప్రక్రియ శుక్రవారమే మొదలైంది. ఇవాళ ఉదయానికే రైతులు తమ సరంజామాను ట్రాక్టర్లతో సర్దేరి ఎక్కడికక్కడే ర్యాలీగా ఇంటిబాట పట్టారు. విజయయాత్రలు పేరుతో రైతుల నిష్క్రమణ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతున్నది.