మరోసారి ఢిల్లీబాట పట్టిన అన్నదాతలు
Delhi: నిరుద్యోగ సమస్య, గతంలో ఇచ్చిన హామీల అమలుపై డిమాండ్
Delhi: రైతులు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. రైతు చట్టాల ఉపసంహరణ కోసం గతేడాది ఢిల్లీ, సరిహద్దు ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్న రైతులు మరోసారి పోరుబాట పట్టారు. నిరుద్యోగ సమస్యతో పాటు గతంలో ఇచ్చిన హామీలను అమలు పర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా పంచాయతీలో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. వివిధ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలిరావడంతో దేశ రాజధానిలో మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడిది. జంతర్ మంతర్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేసి ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. అలాగే ఢిల్లీని కలిపే ఘాజిపూర్, సింఘ, టిక్రి సరిహద్దు ప్రాంతాల వద్ద భద్రతను మరింత పెంచారు. నగరంలోకి వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీంతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది.
ఇప్పటికే భారత్ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి, ప్రముఖ రైతునేత రాకేశ్ టికాయత్‌ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న టికాయత్‌ని ఘాజీపూర్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతుల గొంతును అణచివేయలేరని ట్విటర్ ద్వారా టికాయత్ స్పష్టం చేశారు.
దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని ఆరోపిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఈ మహా పంచాయతీక్ పిలుపునిచ్చిది. అలాగే కనీస మద్దతు ధరను సక్రమంగా అమలు పర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.