Employees Retirement: అసమర్ధ ఉద్యోగులపై సరైన నిర్ణయం తీసుకోండి..ఆదేశాలు జారీ చేసిన కేంద్రం
Employees Retirement: అవినీతి, అసమర్ధ అధికారుల ముందస్తు రిటైర్ మెంట్ పై సర్వీసు రికార్డులను మరింపు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది..
Employees Retirement | అవినీతి, అసమర్ధ అధికారుల ముందస్తు రిటైర్ మెంట్ పై సర్వీసు రికార్డులను మరింపు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వాలపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ముప్పయ్యేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరి సర్వీసు రికార్డులను మదింపు చేయాలని, అసమర్థ, అవినీతి అధికారులకు ముందస్తు రిటైర్‌మెంటు ఇచ్చి ఇంటికి పంపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 కింద 56 (జె), 56 (ఐ), 48 (1)(బి) నిబంధనల ప్రకారం... ఉద్యోగి పనితీరును పరిశీలించి ప్రజాప్రయోజనాల దృష్ట్యా అతనికి రిటైర్‌మెంట్ ఇచ్చి పంపే సంపూర్ణ హక్కు సంబంధిత పై అధికారికి ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తు రిటైర్‌మెంట్ 'శిక్ష'కాదని వివరించింది.
ఉద్యోగి 50 లేదా 55 ఏళ్లకు చేరుకున్నాక, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నాక... ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా సదరు ఉద్యోగిని ఇంటికి పంపించవచ్చని పేర్కొంది. ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేసి వారిని సర్వీసులో కొనసాగించడంపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ అవుతుంటాయని, ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల విషయంలో మరింత స్పష్టత ఇవ్వడానికి, అమలులో ఏకరూపత తేవడానికి తాజా ఆదేశాలు జారీచేశామని సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. రిటైర్ చేయదలచుకున్న ఉద్యోగికి మూడు నెలల నోటీసు ఇవ్వాలని, అలాకాని పక్షంలో మూడునెలల వేతనం ఇచ్చి పంపాలని తెలిపింది. 50 లేదా 55 ఏళ్లకు చేరుకుంటున్న, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోబోతున్న ఉద్యోగులందరి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను ప్రతిశాఖలో నిర్వహించాలని, ఏడాదికి నాలుగుసార్లు ఈ జాబితాను మదింపు చేయాలని ఆదేశించింది.
డిజిటల్ లాకర్‌లోకి పెన్షన్ ఆర్డర్
రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌కు సంబంధించిన పత్రాల కోసం నిరీక్షించే బాధ తప్పనుంది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఎలక్ట్రానిక్ రూపంలో ఇకపై నేరుగా ఉద్యోగుల డిజిటల్ లాకర్‌కు పంపనున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు. పెన్షన్ ప్రక్రియలో ఇక ఆలస్యానికి తావుండదని, అలాగే పెన్షన్ ఆర్డర్ పత్రాలను పోగొట్టుకునే ప్రమాదం ఉండదని మంత్రి తెలిపారు. పౌరులు తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవడానికి డిజిటల్ లాకర్ ఉపకరిస్తుంది.