వృద్ధాప్యంలో ఆసరా కాలేకపోతున్న కన్నపిల్లలు!

Update: 2020-09-28 07:52 GMT

పిల్లల భవిష్యత్ కోసం పరితపించారు. అష్టకష్టాలు పడి చదివించారు. ఎన్నో ఎదురుదెబ్బలు, మరెన్నే సవాళ్లను ఎదుర్కొని పిల్లలే జీవితమనుకున్నారు. ఇక జీవిత చరమాంకంలో అలసి సొలసిన తల్లిదండ్రులను కన్నబిడ్డలే కాదంటున్నారు. అవమానాలు చిత్కారాలకు గురిచేస్తున్నారు. పిరికెడు మెతుకులకు, చిటికెడు ప్రేమకు నోచుకోవడం లేదు. మనువళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన సమయంలో దీనగాధను వినిపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. పేగు బంధాన్ని గుర్తుచేసుకోవడం తప్పా కంటినిండా చేసుకొని వృద్ధుల దుస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరి.

ఆధునిక సమాజంలో పోటెత్తుతున్న కొత్తపోకడల ప్రవాహంలో ఆత్మీయతలు, అనుబంధాలు కొట్టుకుపోతున్నాయి. డబ్బే సర్వస్వం కావడంతో కన్నవాళ్లను కాదంటున్నారు. రక్తం పంచి ఇచ్చిన అమ్మనాన్నలనే పరాయివాళ్లుగా చూస్తున్నారు. కన్నకొడుకులే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు సాగనంపుతున్నారు. తీరికలేక కొందరు తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తున్నారు. మరికొందరు విదేశాలకు వెళ్తూ. అమ్మానాన్నలను ఆశ్రమాలకు తరలిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులను పోషించలేక, వైద్యం అందించలేక ఓల్డ్ ఏజ్ హోమ్ లకు పంపుతున్నారు. మరికొందరైతే భార్యల పోరు పడలేక కన్నవారిని వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు.

జీవితం బాగున్నంత కాలం ఉన్నదంతా కటుంబ అవసరాలకోసం ఖర్చు చేసి చివరికి తమకంటూ ఏమీ లేక అనాథలవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇక కొందరైతే జానెడు పొట్ట నింపుకోవడం కోసం యాచకులుగా మారిన సందర్భాలున్నాయి. వృద్ధుల సమస్యలపై హెల్ప్ ఏజ్ ఇండియా అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు 31 శాతం మంది వారి పిల్లలు, కుటుంబసభ్యుల చేతిలో అగౌరవానికి, నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు గుర్తించింది. వయోవృద్ధులను ప్రధానంగా కుమారులు, కోడళ్లే దూషిస్తున్నారని సర్వేలో తేలింది.

ఇక 55 శాతం మంది వయోవృద్ధులు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోవడం లేదని హెల్ప్ ఏజ్ ఇండియా తెలిపింది. మరో 20 శాతం మంది బయటకు చెప్పుకున్నా దాని తీవ్రతను చాలా వరకు తగ్గించి చూపుతున్నట్లు తెలిపింది. మన రాష్ట్రంలో దాదాపు 43 శాతం మంది వయోవృద్ధులు వారి పిల్లలు, కుటుంబసభ్యుల చేతిలో చిత్కారాలకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆ సర్వే వెల్లడించింది. ఇలాంటి సమస్యలు రాకుండా సంపాదనలో భవిష్యత్‌ అవసరాల కోసం కొద్దిగా దాచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొవిడెండ్‌ ఫండ్‌, గ్రాట్యుటీ ద్వారా వచ్చిన మొత్తం ఖర్చు చేస్తే తర్వాత అవసరాలను తట్టుకోవడానికి కష్టమవుతుందని సూచిస్తున్నారు.

Tags:    

Similar News