Droupadi Murmu: అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ
*రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించిన ముర్ము
Droupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ద్రౌపది ముర్ముతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె ఓత్ రిజిస్టర్‌పై సంతకం చేశారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ముర్ము తెలిపారు. ప్రమాణస్వీకారానికి ముందు ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు.
రాజ్‌ఘాట్ నుంచి రాష్ట్రపతి భవనానికి చేరుకున్న ముర్మ.. అక్కడ రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్టులో ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్ కోవింద్‌లు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారు అక్కడి నుంచి బయలుదేరి పార్లమెంట్‌కు చేరుకున్నారు.
పార్లమెంట్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్ కోవింద్‌లను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సెంట్రల్ హాల్‌కు తీసుకువెళ్లారు. ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్న తర్వాత సెంట్రల్ హాల్‌లో జాతీయ గీతం ప్లే చేశారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన తొలి గిరిజన నాయకురాలిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా కూడా నిలిచారు.