రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తామని సామాజిక కార్యకర్త అన్నా హజారే కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ రాశారు. అన్నా హజారే లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రైతులు ముందుకొచ్చి చట్టాలను అర్థం చేసుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. వారిచ్చే విలువైన సూచనలను తప్పకుండా స్వీకరిస్తామని తెలిపారు. రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని కొన్ని శక్తులు రైతులను తప్పుదారి పట్టిస్తూ, ఆందోళనలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.
అన్నా హజారే ఈ ఉద్యమంలో చేరతారని తాను అనుకోవడం లేదన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్, ట్రేడర్ సహా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉందని తెలిపారు. చర్చలు లేకపోతే సమాచారలోపం ఏర్పడి వివాదాలకు దారితీస్తుందన్నారు. చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని చెప్పారు.