Kolkata: కోల్‌కతాలో కొనసాగుతున్న డాక్టర్ల ఆందోళనలు

Kolkata: నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

Update: 2024-08-12 16:15 GMT

Kolkata: కోల్‌కతాలో కొనసాగుతున్న డాక్టర్ల ఆందోళనలు 

Kolkata: కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ మెడికల్ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పెను సంచలనం రేపింది. ఈ అమానవీయ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాల వేళ ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. హత్యాచార ఘటన తర్వాత మృతురాలి పరువుకు భంగం కలిగించేలా ప్రిన్సిపల్‌ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన రాజీనామా చేయాలంటూ కాలేజీ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే పదవి నుంచి వైదొలిగిన ఆయన మీడియాతో వెల్లడించారు. బాధితురాలికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. కావాలనే తన పరువు తీస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ అవమానాన్ని భరించలేకపోతున్నానని.. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అన్నారు. మృతి చెందిన అమ్మాయి కూడా తన కుమార్తె లాంటిదేనని. భవిష్యత్తులో మరెవరికీ ఇలాంటి దారుణ ఘటన జరగకూడదని... డాక్టర్ సందీప్ ఘోష్ అన్నారు.

మరోవైపు రెండు రోజులుగా డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. ఆస్పత్రిలో వైద్యులకు రక్షణ కల్పించాలని వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రధానంగా ఆరు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ ఘటనపై వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని,..నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని... బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఆస్పత్రి ప్రిన్సిపల్‌, సెక్యూరిటీ ఇన్‌ఛార్జీలను వెంటనే తొలగించాలని... వైద్యుల రక్షణ విషయంలో సెంట్రల్‌ ప్రొటెక్షన్‌ చట్టాన్ని కేంద్రం వెంటనే అమలు చేసేలా రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలోని బిల్డింగ్‌కు లేదా లైబ్రరీకి మృతిరాలి పేరు పెట్టాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వైద్యులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News