Kolkata Rape Murder Case: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వైద్యుల నిరసన
Kolkata Rape Murder Case: శనివారం 24 గంటల పాటు సమ్మె నిర్వహించిన వైద్యులు
Kolkata Rape Murder Case: దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన చేపడుతున్నారు. శనివారం 24 గంటల పాటు సమ్మె నిర్వహించారు. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ 'స్టెత్ డౌన్' ప్రకటించారు. దీంతో వైద్యసేవలు స్తంభించిపోయాయి.
వైద్యుల సమ్మెతో అనేక ఆస్పత్రుల్లో ఓపీ, డిస్పెన్సరీ వంటి వైద్యసేవలు నిలిచిపోయాయి. అయితే.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఐసీయూ, ఎమర్జెన్సీ విభాగం, ఆపరేషన్ థియేటర్ల కార్యకలాపాలను మాత్రం వైద్యులు కొనసాగించారు. అటు వైద్యుల ఆందోళనలపై కేంద్ర వైద్యశాఖ స్పందించింది. శనివారం ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్ర వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కేంద్రం ముందు వైద్యుల సంఘాలు ఐదు డిమాండ్లను పెట్టాయి. ఈ డిమాండ్లపై ఒక కమిటీని వేసి సంప్రదింపులు జరుపుతామని కేంద్ర వైద్య శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే.. కోల్‌కతా ఘటనను సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు మూడు లేఖలు అందాయి. మరోవైపు.. కోల్‌కతా ఘటనకు వ్యతిరేకంగా విదేశాల్లోనూ నిరసనలు జరిగాయి. యూకేలో భారతీయ వైద్యులు, వైద్య విద్యార్థులు లండన్‌లోని ఇండియా హౌస్ ముందు శాంతియుత నిరసన తెలిపారు. బంగ్లాదేశ్‌లోని ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.