ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
*హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు.. ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చ
Delhi: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఏపీ సీఎస్ సమీర్‌శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఉభయ రాష్ట్రాల మధ్య నెలకొన్ని 7 అంశాలతో పాటు.. ఏపీకి సంబంధించిన మరో 7 అంశాలపై చర్చ జరగనుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని ఆస్థుల పంపకాలపై చర్చించనున్నారు. విభజన జరిగి 8ఏళ్లు అయినా.. పలు కంపెనీలు, కార్పొరేషన్లు, రాష్ట్ర సంస్థల విభజన ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు. కొన్ని సంస్థల్లో ఉద్యోగుల విభజన జరిగినప్పటికీ... ఆస్థుల విభజన మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఇక చట్టంలో పేర్కోని, మరికొన్ని సంస్థల విభజన గురించి కూడా ఇరు రాష్ట్రాలతో కేంద్ర అధికారులు చర్చించనున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన కూడా ఇంకా పూర్తి కాలేదు. అయినా రెండు రాష్ట్రాలు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాయి.
తెలంగాణలోనే ఉన్న సింగరేణి కాలరీస్‌లో తమకూ వాటా కావాలని ఏపీ సర్కార్ అడుగుతోంది. దీంతో పాటు ఏపీ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ కూడా ఇంకా విభజన పూర్తి కాలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధులు కూడా రెండు రాష్ట్రాలకు పంపకాలు జరగాల్సి ఉంది. విభజన జరిగిన ఏడాది బియ్యం సరఫరా చేసినందుకు గాను.. తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నుంచి ఏపీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు బకాయిలు రావాల్సి ఉంది. ఈ ఏడు అంశాలు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో కూడుకున్నవే. అందుకే వీటి విభజన ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. మరోవైపు ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. తెలంగాణ నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందన లేదు. ఈ అంశం ఎజెండాలో లేకపోయినప్పటికీ సమావేశంలో ప్రస్తావించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
ఇక ఏపీకి సంబంధించి ఎజెండాలో పెట్టిన ఏడు అంశాల్లో రాజధాని అంశం కూడా ఒకటి. ఇప్పటివరకు రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఎంత ఇచ్చింది..? ఇంకా ఎంత అవసరం అనే దానిపై చర్చ జరగనుంది. ప్రస్తుతం ఏపీ సర్కార్ మూడు రాజధానులని చెబుతుండటంతో.. కేంద్రం ఏం స్పష్టత ఇస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. అటు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాల్సిన పన్ను రాయితీలు, రెవెన్యూలోటు ప్రకారం రావాల్సిన నిధులు కూడా కూడా పూర్తిస్థాయిలో అందలేదు. 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్రతిఏటా ఇచ్చే 350 కోట్ల రూపాయలు.. రేండేళ్లు మాత్రమే అందాయి. దీంతో పాటు కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, కొత్త రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ మీద కూడా కేంద్ర హోంశాఖ చర్చించనుంది. ఏపీలో పన్నుల్లో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చే అంశాన్ని కూడా హోంశాఖ ఎజెండాలో పొందుపరిచింది.