ప్రయాణీకులు ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నాలుగో దశలో భాగంగా నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే.

Update: 2020-05-24 11:15 GMT

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నాలుగో దశలో భాగంగా నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశీయంగా ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నారు. నిబంధనల అనుగుణంగా విమాన, రైలు, బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ దేశీయంగా రైలు, విమాన ప్రయాణాలు చేసేవారు ఎలాంటి నిబంధనలు పాటించాలి, విదేశాల నుంచి వచ్చే వారు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మార్గదర్శకాలను ప్రకటించింది.

* ప్రయాణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలను ట్రావెల్సర్‌, ఏజెన్సీలు టికెట్తో పాటు ముద్రించాల్సిందే.

* ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే వారు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* రైల్వేస్టేషన్లు బస్టాండ్‌లలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.

* కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణకు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో ప్రకటించిన విధి,విధానాలను తప్పక పాటించాలి.

* విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్‌లను తరచూ శానిటైజ్‌ చేయాలి. క్రిమినాశక ద్రావణాలతో శుభ్రపరచాలి. అదే విధంగా ప్రయాణికులకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.

*ప్రయాణం ముగించుకుని బయటకు వెళ్లే సమయంలోనూ ప్రయాణికులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి.

*కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణికులను దగ్గర్లో ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్న ఆస్పత్రికి తరలించాలి. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి

* రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాలు తప్పనిసరిగా ప్రయాణికులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతించాలి.

* ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్‌ మాస్క్‌ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత కూడా ప్రయాణికుడిదే.

*కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్‌-19 చికిత్స కేంద్రాలకు తరలించాలి.

*కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే వారిని హోం క్వారంటైన్‌కు లేదా ఐసోలేటెడ్‌ కొవిడ్‌-19 వార్డుకు తరలించాలి. ఇది వారి ఎంపికను బట్టి ఉంటుంది. ఐసీఎంఆర్‌ ప్రామాణికాల ఆధారంగా ఇవి ఉండాలి.

*ఐసోలేటెడ్‌ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్‌ వస్తే ... అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. హోం క్వారంటైన్‌ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి. 

Tags:    

Similar News