Corona Vaccine: టీకా పంపిణీలో మరో మైలురాయిని చేరుకున్న భారత్‌

Corona Vaccine: కేవలం 92 రోజుల్లో 12 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

Update: 2021-04-18 11:26 GMT

కరోనా వాక్సిన్ 

Corona Vaccine: ప్రతి ఐదుగురిలో ముగ్గురికి టీకా వేస్తే సామూహిక రోగ నిరోధక శక్తి లభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారతదేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి, వాడకాలను ఎన్నో రెట్లు పెంచితే కానీ, సెకండ్‌ వేవ్‌ విజృంభణకు పగ్గాలు వేయలేం. అయితే... ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా టీకాలు వేగంగా అందుబాటులోకి రావడం లేదని అనేక రాష్ట్రాలు మొరపెట్టుకుంటున్నాయి. టీకాలు అందక వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పలు రాష్ట్రాలు ఆపేశాయి. ఈ నేపథ్యంలోనే... కరోనా వైరస్‌ టీకా పంపిణీలో భారత్‌ మరో మైలు రాయిని చేరుకుంది.

కరోనా టీకా పంపిణీలో భారత్‌ మరో మైలు రాయిని అధిగ‌మించింది. కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసింది. 'ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా భారత్ 92 రోజుల్లో 12 కోట్ల డోసులు పూర్తి చేసుకుంది. దేశంలో మొత్తం 12.26 కోట్లకు పైగా టీకాలు ఇచ్చామని కేంద్రం తెలిపింది. అందులో ఆరోగ్య సిబ్బందిలో 91 లక్షల మందికి పైగా తొలి డోసు టీకా తీసుకోగా, 57 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌లో 1.12 కోట్లకు పైగా తొలి డోసు తీసుకోగా 55 లక్షలకు పైగా రెండో డోసు తీసుకున్నారని కేంద్రం స్పష్టం చేసింది.

8 రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ 59.5శాతంగా నమోదైంది. అందులో గుజరాత్‌లో 1.03కోట్లు, మహారాష్ట్రలో 1.21 కోట్లకు పైగా, యూపీలో 1.07 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. 12 కోట్ల మైలు రాయి చేరుకోవడానికి యూఎస్‌లో 97, చైనాలో 108 రోజులు సమయం పట్టిందని కేంద్రం వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 26 లక్షల డోసులు పంపిణీ చేశారు.

ఒకవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. 'వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు' అంటూ వివిధ ఆస్పత్రుల వద్ద బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రాలు సైతం వ్యాక్సిన్‌ సరఫరాను పెంచాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాశాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. సమస్య వ్యాక్సిన్‌ కొరత కాదని, సరైన ప్రణాళిక లేకపోవడం అని చురకలంటించింది. మొత్తంగా ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా టీకాలు వేగంగా అందుబాటులోకి రావడం లేదని పలు రాష్ట్రాలు అంటున్నాయి.

Tags:    

Similar News