Coronavirus Updates in Odisha: ఒడిషాలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,078 కరోనా కేసులు
Coronavirus Updates in Odisha: ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఒడిషాలో కొత్తగా 1,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరో ఐదుగురు మృతి చెందారని, వీరు మధుమేహంతో బాధపడుతున్నారని, నలుగురు 60ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారని తెలిపింది. ఐదుగురిలో నలుగురు గంజాం జిల్లాకు, ఒకరు కందామాల్ జిల్లాకు చెందినవారున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,835కి చేరింది. వీటిలో ప్రస్తుతం 6,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 13,310 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 108 మంది వైరస్ బారినపడి మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గంజాం జిల్లాలో జూలై 17వ తేదీ నుంచి జూలై 31 వరకు లాక్‌డౌన్ విధించినట్లు స్టేట్ చీఫ్ సెక్రటరీ అసిత్ త్రిపాఠీ తెలిపారు.
కాగా భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 37,724 కేసులు నమోదు కాగా, 648 మంది ప్రాణాలు విడిచారు. దేశంలో మొత్తం 11,92,915 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,11,113 ఉండగా, 7,53,049 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 28,732 మంది కరోనా వ్యాధితో మరణించారు.